Thursday, May 21, 12:43
34.2 C
Hyderabad

హర్మూజ్ సంక్షోభానికి భారత్ బ్రేక్.. అరేబియా సముద్రం గుండా రూ. 40,000 కోట్ల మెగా గ్యాస్ పైప్‌లైన్!

India’s Mega Undersea Pipeline Project with Oman for Energy Security
India’s Mega Undersea Pipeline Project with Oman for Energy Security

హోర్ముజ్ జలసంధిలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, ఒమన్ నుంచి భారత్‌కు నేరుగా సముద్రగర్భం గుండా పైప్‌లైన్ నిర్మించే ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. $4.7-4.8 బిలియన్లు (రూ.40,000 కోట్ల) వ్యయంతో అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ వస్తే, దీనిని పూర్తి చేసేందుకు అయిదు నుంచి ఏడేళ్ల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం దేశంలో రోజుకు 190-195 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగం జరుగుతోంది. 2030 నాటికి ఇది 290-300 mmscmdకి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న గ్యాస్ డిమాండ్‌కు ఈ సముద్రగర్భ పైప్‌లైన్ ఎంతో కీలకంగా మారనుంది.

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రమైన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల రిపోర్టును సిద్ధం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్ (GAIL), ఇంజనీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)లను పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరనుంది. ఢిల్లీకి చెందిన ‘సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్‌ప్రైజ్’ (SAGE) అనే ప్రైవేట్ కన్సార్టియం ఇచ్చిన ప్రాథమిక అధ్యయనం ఆధారంగా ముందడుగులు వేస్తోంది. ఈ రిపోర్టులు సానుకూలంగా వస్తే గ్యాస్ సరఫరా ఒప్పందాలు, నిధుల సమీకరణ, నిర్వహణ ప్రణాళికలపై భారత్, ఒమన్ మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియా నుంచి ప్రత్యేకంగా నిర్మించే ఈ పైప్‌లైన్ ద్వారా తక్కువ ధరకే ఇంధన సరఫరా లభిస్తుంది. అలాగే సముద్ర రవాణా మార్గాల్లో ఎదురయ్యే అడ్డంకులు, ఇతర దేశాల పరిధి గుండా వెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

Also Read: ఎబోలా వైరస్ డేంజర్ బెల్స్.. 134 మంది మృతి

‘మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్-వాటర్ పైప్‌లైన్’ (MEIDP)గా పిలిచే ఈ ప్రాజెక్టు అరేబియా సముద్రం గుండా ఒమన్‌ను నేరుగా గుజరాత్ తీరంతో అనుసంధానిస్తుంది. ఈ పైప్‌లైన్ 2,000 కిలోమీటర్ల వరకు ఉండనుంది. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఒమన్, UAE మీదుగా ఈ రూట్‌ను రూపొందించారు. దీనివల్ల రోజుకు దాదాపు 31 mmscmdల సహజ వాయువును భారత్‌కు రవాణా చేయవచ్చు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఒమన్, UAE, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మేనిస్తాన్, ఖతార్ లాంటి దాదాపు 2,500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలున్న దేశాల వనరులను భారత్ సులభంగా వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. సముద్రంలో దాదాపు 3,450 మీటర్ల లోతున నిర్మించనున్న ఈ పైప్‌లైన్.. ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రగర్భ గ్యాస్ పైప్‌లైన్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది. లోతైన సముద్రంలో పైప్‌లైన్లను ఏర్పాటు చేయడం, మరమ్మతు సాంకేతికతల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యమేనని కూడా మరికొందరు నిపుణులు చెబుతున్నారు. దీని కోసం SAGE సంస్థ ఇప్పటికే రూ. 25 కోట్ల వ్యయంతో సముద్రగర్భ పరిస్థితులను పరీక్షించేందుకు ప్రతిపాదిత రూట్‌లో 3,000 మీటర్ల టెస్ట్ పైప్‌లైన్‌ను కూడా వేసింది.

చైనాతో పోల్చిచూస్తే భారత్‌కు వ్యూహాత్మక సహజ వాయువు నిల్వలు లేవు. గత రెండు దశాబ్దాలుగా చైనా అనేక భూగర్భ గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లను నిర్మించుకుంది. సంక్షోభ సమయాల్లోనూ తమ స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతోంది. ఈ క్రమంలోనే భారత్ కూడా తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు, హోర్ముజ్ లాంటి సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.