Venezuela

వెనిజులా కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు వరుసభూకంపాలు(Earthquakes) సంభవించాయి. దీనివల్ల రాజధాని కరాకస్‌లో పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. అంతేకాకుండా, కరేబియన్ ప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) తెలిపిన వివరాల ప్రకారం.. మొదట సాయంత్రం స్థానిక సమయం 18:04 గంటలకు మొంటాల్బన్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో తొలి భూకంపం వచ్చింది. ఇది భూమి లోపల దాదాపు 13 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అదే ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో 7.5 తీవ్రతతో అంతకంటే బలమైన రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొరాన్ అనే తీర ప్రాంతానికి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ భూకంపాల తీవ్రతకు వెనిజులాలోని చాలా ప్రాంతాలు వణికిపోయాయి. పొరుగు దేశమైన కొలంబియాలో కూడా ప్రజలు ఈ ప్రకంపనలను గుర్తించారు. రాజధాని కరాకస్‌లో భవనాలు తీవ్రంగా ఊగిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్ల గోడలు కూలిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన ధూళి మేఘాలు కమ్ముకున్నాయి.

Also Read : ఫ్రాన్స్ మ్యూజిక్ ఫెస్ట్‌లో దారుణం.. మహిళలపై సిరంజిలతో దాడులు, అత్యాచారాలు.. 243 మంది?

చాలా ఆందోళనకరంగా మారింది

కరాకస్‌ నగరంలో పలు భవనాలు దెబ్బతిన్నాయని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో వెల్లడించారు. ఆయన ప్రభుత్వ మాట్లాడుతూ.. ముఖ్యంగా కరాకస్‌లోని అల్టామిరా ప్రాంతంలో ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిందని చెప్పారు. ఇంకా మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున, అవి దెబ్బతిన్న భవనాలను మరింత పాడు చేయవచ్చని, అందుకే ప్రజలంతా ఇళ్ల బయటే ఉండాలని ఆయన కోరారు.

ఈ విపత్తులో కొందరు గాయపడ్డారని మంత్రి తెలిపారు. అత్యవసర సహాయక బృందాలు, అంబులెన్సులు వేగంగా వెళ్లడానికి వాహనదారులు రోడ్లను ఖాళీగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. “ప్రజలు కంగారు పడుతున్నారని మాకు తెలుసు, కానీ అవసరమైన వారికి సహాయం చేయడానికి, రక్షణ చర్యలు చేపట్టడానికి మేము నిబంధనల ప్రకారం వేగంగా పని చేస్తున్నాము” అని కాబెల్లో చెప్పారు. అలాగే పిల్లలు, వృద్ధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ అందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలని ఆయన సూచించారు.

Also Read : దూసుకొస్తున్న హీట్ డోమ్.. నిప్పుల కొలిమిలా మారనున్న భారత్.. వినాశనం తప్పదా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.