
ఇటీవల వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్నే కుదిపేసింది. క్షణంలో ముంచుకొచ్చిన ఈ ఘోరమైన విపత్తు వందలాది మంది ప్రాణాలను బలిగొంది. పదుల సంఖ్యలో ఉన్న అంతస్తుల ఎత్తైన భవనాలు నేల కూలాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. జూన్ 24, 2026న రాత్రి రెండు భారీ భూప్రకంపనలు ఆ దేశాన్ని గజగజ వణికించాయి.
ఈ ప్రకృతి విపత్తు వెనిజులా దేశ రాజధాని కారకాస్‌కు ఉత్తరాన 12 కి.మీ దూరంలో గల లా గువైరా (ప్రైయా గ్రాండే) తీర ప్రాంతంలో సంభవించింది. మొదటి ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా ప్రజలు ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో 7.5 తీవ్రతతో రెండో ప్రమాదకరమైన భూకంపం సంభవించడం వినాశనానికి కారణమైంది.
Lucas Trejo family missing
ఈ ఘోరమైన ప్రమాదంలో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ కుటుంబం కూడా చిక్కుకుపోవడం కలకలం రేపింది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ సీనియర్ ఫుట్‌బాల్ ప్లేయర్ 38 ఏళ్ల లూకాస్ ట్రెజో ‘కోపా వెనిజులా’ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆడేందుకు తన టీంతో కలిసి కారకాస్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటే కుటుంబం.. భార్య, కొడుకు, కూతురు కూడా వచ్చి గువైరాలో ఓ భవనంలో నివాసమున్నారు. ఇక జూన్24 రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి రెండుసార్లు కంపించింది. ఈ ధాటికి బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
అదే సమయంలో లూకాస్ ట్రెజో ఫ్యామిలీ నివాసముంటున్న భవనం కూడా నేలమట్టమైంది. దీంతో భవన శిథిలాల కింద లూకాస్ భార్య, కుమారుడు, కుమార్తె చిక్కుకుపోవడంతో అతడు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఆయన ఏడుస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా తన ఫ్యామిలీ ఆచూకీ లభించకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు.
తన ఫ్యామిలీ క్షేమంగా తిరిగి రావాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘‘మేము ఉంటున్న ప్రైయా గ్రాండే భవనం నేలమట్టమైంది. నా ఫ్యామిలీ ఏమైందో తెలియడం లేదు. దయచేసి భూంకపం సమయంలో వారు ఇంట్లో లేరని దేవున్ని ప్రార్థించండి. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉంటే నా భార్య, పిల్లల ఆచూకీ తెలియజేయండి’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు దేవున్ని ప్రార్థిస్తున్నారు.









