Uzbekistan :  ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఆ దేశం భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. భారత పౌరులకు 30 రోజుల పాటు వీసా లేకుండా ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానం పర్యాటకం, వ్యాపారం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచుతుందని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు. మోదీ రెండు రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా తాష్కెంట్‌లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడు మిర్జియోయెవ్ 30 రోజుల వీసా ఫ్రీ విధానాన్ని ప్రకటించారు.

భారత్ తమకు నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి అని మిర్జియోయెవ్ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య వాణిజ్యం తొలిసారి 100 కోట్ల డాలర్లను దాటిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య కలిసి పనిచేస్తున్న సంస్థల సంఖ్య కూడా ఇటీవలి సంవత్సరాల్లో ఏడు రెట్లు పెరిగిందని మిర్జియోయెవ్ చెప్పారు. ప్రస్తుతం భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య వారానికి 14 నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచడంలో లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ వంటి సంస్థలు కీలకంగా పనిచేస్తున్నాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు చెప్పారు.

భారతీయులకు 30 రోజుల వీసా రహిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మిర్జియోయెవ్ అన్నారు. పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరుగుతాయని చెప్పారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు 1992 మార్చి 18న ఏర్పడ్డాయి. తాష్కెంట్‌లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత దాని సార్వభౌమత్వాన్ని గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ కూడా ఒకటి.

2011లో ఇరు దేశాల సంబంధాలను ‘స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్’ స్థాయికి పెంచారు. అప్పటి నుంచి రాజకీయ, అధికారుల స్థాయిలో తరచూ చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. భారతీయులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన 30 రోజుల వీసా ఫ్రీ సౌకర్యంతో ఇక ఉజ్బెకిస్థాన్ ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఈ నిర్ణయం ఉపయోగపడే అవకాశం ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.