
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. మితిమీరిన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, పేరుకుపోతున్న అప్పుల భారం సామాన్య కుటుంబాల జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ ఇటీవల విడుదల చేసిన ఒక సంచలన నివేదిక ప్రకారం గత మూడేళ్ల కాలంలో అక్కడి ప్రజల రుణ వాయిదాలు చెల్లించే సామర్థ్యం దారుణంగా పడిపోయింది. అమెరికన్ల కలల జీవితానికి ఇప్పుడు అప్పుల ఊబి పెద్ద సవాలుగా మారింది.
2022 నుండి 2025 మధ్య కాలంలో అమెరికన్ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఫెడరల్ రిజర్వ్ విస్తృత స్థాయి సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో వెల్లడైన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రుణాలు తీసుకుని, వాటి రీపేమెంట్లు చేయలేక డిఫాల్ట్ అవుతున్న కుటుంబాల సంఖ్య గత మూడేళ్లలో విపరీతంగా పెరిగింది. 2022 నాటికి అమెరికాలో లోన్ వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాల సంఖ్య 12 శాతంగా ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య ఏకంగా 20 శాతానికి చేరింది. అంటే ఐదవ వంతు కుటుంబాలు సమయానికి అప్పులను చెల్లించడం లేదు. అందులోనూ 8 శాతానికి పైగా కుటుంబాలు గత రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఒక్క ఈఎంఐ కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉన్నాయి. 2010లో చోటుచేసుకున్న తీవ్ర ఆర్థిక మాంద్యం తర్వాత ఈ స్థాయిలో సంక్షోభం ఏర్పడటం ఇదే మొదటిసారి.
అమెరికాలో సామాన్యుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం అదుపు తప్పిన ద్రవ్యోల్బణం. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, హెల్త్‌కేర్, విద్య, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆదాయం పెరగకపోయినా, రోజువారీ ఖర్చులు రెట్టింపు కావడంతో ప్రజలు తమ నెలవారీ బడ్జెట్‌ను సరిపెట్టుకోవడానికి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఉదాహరణకు గతంలో సాధారణంగా లభించే కిరాణా సామాను ధరలు కూడా ప్రస్తుతం సామాన్యుడికి భారం కాగా జీతంలో ఎక్కువ భాగం కేవలం అద్దెలు, నిత్యావసరాలకే సరిపోతోంది. అయితే ఆదాయానికి మించి పెరిగిన ఖర్చుల వల్ల చాలామంది విద్యుత్ బిల్లులు, సరుకుల కొనుగోళ్లు, వైద్యావసరాలకు కూడా క్రెడిట్ కార్డులను వాడటం పెంచేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లు, లోన్ వడ్డీలు ఆకాశాన్నంటాయి. దీనివల్ల పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం, లేదా వడ్డీలు మాత్రమే కడుతూ అసలును అలాగే ఉంచే చక్రబంధంలో సామాన్యులు చిక్కుకుపోతున్నారు.
అమెరికాలో కారు, సొంత ఇల్లు కలిగి ఉండటం కనీస అవసరం. అయితే కార్ల ధరలు పెరగడంతో పాటు వాహన రుణాలపై వడ్డీలు కూడా గణనీయంగా పెరిగాయి. దీనికితోడు గృహ రుణాలు తీసుకున్నవారు కూడా పెరిగిన వడ్డీ భారంతో ప్రతి నెలా భారీ మొత్తంలో ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. నెలవారీ ఆదాయంలో సగానికి పైగా కేవలం హౌసింగ్, కార్ ఈఎంఐలకే వెచ్చిస్తుండటంతో, ఇతర అత్యవసర సమయాల్లో చేతిలో నగదు లేక ప్రజలు లోన్ డిఫాల్టర్లుగా మారుతున్నారు. 2010 నాటి ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయేమోనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.









