అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు ఆయన ఉజ్బెకిస్తాన్, భారత్‌ పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా భారత్‌లోని ముంబై, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నగరాల్లో ఆయన పర్యటిస్తారు. భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యాపార, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడం, ఇంధన రంగంలో సేవలను విస్తరించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ ఏడాదిలోనే మార్కో రూబియో భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మార్కో రూబియో భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కీలక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్‌లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఈ భేటీలలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్న జామ్‌నగర్‌ను ఆయన సందర్శిస్తున్నారు. భారత్‌కు రాకముందు మార్కో రూబియో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగే C5+1 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అమెరికా, మధ్య ఆసియా దేశాల మధ్య శాంతి, సమృద్ధి, వ్యూహాత్మక సహకారం కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవడంపై అక్కడ మాట్లాడనున్నారు. ఆ తర్వాత నేరుగా భారత్‌లో అడుగుపెట్టి ద్వైపాక్షిక చర్చలను కొనసాగిస్తారు.

ఇటీవల భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ రెండు దేశాల అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ, సమాచార సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాలలో భారత్-అమెరికా భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారని త్వరలోనే ట్రంప్ కూడా భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఇన్‌డైరెక్ట్‌గా తెలిపారు. రక్షణ రంగంలో భారత్, అమెరికాలు ఇప్పటికే సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన తరంగ్ శక్తి యుద్ధాభ్యాసంలో 500 మందికి పైగా సైనికులు పాల్గొనడమే కాకుండా రాజస్థాన్‌లో తొలిసారిగా అమెరికాకు చెందిన అధునాతన F-35 యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యి సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. గతంలో మే 23 నుంచి 26 వరకు తొలిసారి భారత్‌ను సందర్శించిన మార్కో రూబియో.. ఇప్పుడు రెండోసారి వస్తుండటంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.