Venezuela earthquake 2026 :  వెనెజువెలా దేశం తన చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో ఒకే నిమిషం వ్యవధిలో సంభవించిన రెండు శక్తిమంతమైన వరుస భూకంపాలతో అతలాకుతలమైంది. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) ప్రకారం.. మొదట రిక్టర్ స్కేలుపై 7.1  తీవ్రతతో భూమి కంపించగా, కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే అంతకంటే ఎక్కువ తీవ్రతతో (7.5) రెండో భూకంపం దూసుకొచ్చింది. ఇలా చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ఒకే ప్రాంతంలో సమాన తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించడాన్ని శాస్త్రవేత్తలు ‘ఎర్త్‌క్వేక్‌ డబ్లెట్‌’గా పిలుస్తున్నారు. రాజధాని కారకస్‌కు పశ్చిమాన ఉన్న మోరోన్ సమీపంలో, భూగర్భంలో తక్కువ లోతులోనే ఈ భూకంప కేంద్రాలు నమోదు కావడంతో విధ్వంసం తీవ్రత ఊహాతీతంగా మారింది.
ఈ జంట భూకంపాల ధాటికి కారకస్‌తో పాటు పలు నగరాల్లో వందలాది బహుళ అంతస్తుల భవనాలు, నివాసాలు క్షణాల వ్యవధిలో కుప్పకూలాయి. భూకంప తీవ్రత, ఆయా ప్రాంతాల్లోని జనసాంద్రత, భవనాల నిర్మాణ నాణ్యతను పరిగణనలోకి తీసుకుని యూఎస్‌జీఎస్ (USGS) ప్రాథమిక ప్రమాద అంచనాను విడుదల చేసింది. ఈ విపత్తు కారణంగా 10 వేల నుంచి ఒక లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, రహదారులు బీటలు వారడం, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ వెనెజువెలాలో అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు.
వెనెజువెలా అతలాకుతలమైన అదే సమయంలో.. అమెరికాలోని కాలిఫోర్నియాలో (5.6 తీవ్రత), జపాన్‌లో (7.2 తీవ్రత) కూడా భూకంపాలు సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పైగా గురువారం తెల్లవారుజామున భారతదేశంలోని జమ్మూకశ్మీర్ (పుల్వామా) ప్రాంతంలోనూ 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి (దీని కేంద్రం నేపాల్‌లో 15 కి.మీ లోతున ఉంది). అయితే, ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు ఇలా వేర్వేరు చోట్ల భూమి కంపించడంపై కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రసిద్ధ భూకంప శాస్త్రవేత్త డాక్టర్ లూసీ జోన్స్ స్పష్టతనిచ్చారు.
“ఈ భూకంపాలు వేర్వేరు ఫాల్ట్ సిస్టమ్స్ (పగుళ్లు), విభిన్న ప్లేట్ బౌండరీలలో వచ్చాయి. వేల మైళ్ల దూరంలో ఉండే ఒక భూకంపం మరో భూకంపానికి దారితీసే అవకాశం దాదాపు శూన్యం. ఒకే సమయంలో ఇవన్నీ జరగడం కేవలం యాదృచ్ఛికం (Coincidence) మాత్రమే” అని ఆమె తేల్చి చెప్పారు.
వెనెజువెలాలో ఈ స్థాయి విపత్తు రావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. అంతకుముందు 1900 సంవత్సరంలో 7.7 తీవ్రతతో ఇక్కడ భారీ భూకంపం రాగా, ఆ తర్వాత 2018లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించింది. కానీ నాటితో పోలిస్తే ప్రస్తుత విధ్వంసం, ప్రాణనష్టం ఊహకందని స్థాయిలో ఉన్నాయి. ఈ భూకంపాల ప్రభావం పొరుగు దేశాలైన బ్రెజిల్, కొలంబియాల్లోనూ కనిపించింది. ప్రారంభంలో కరేబియన్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ముప్పు తప్పడంతో అధికారులు వాటిని ఉపసంహరించుకున్నారు. ప్రధాన భూకంపాల తర్వాత కూడా దాదాపు 20 సార్లు చిన్నపాటి ప్రకంపనలు (Aftershocks) రావడంతో, దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.