US Missile Stocks Running Low
US Missile Stocks Running Low

ప్రపంచంలోనే సూపర్ మిలటరీ పవర్‌గా పేరున్న అమెరికాకు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురైంది. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కొద్దీ.. అమెరికా ఎయిర్‌ డిఫెన్స్‌ ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా శత్రువుల మిస్సైళ్లు, డ్రోన్లను గాల్లోనే అడ్డుకునే ఇంటర్‌సెప్టర్స్‌ షార్టేజి పెరుగుతోంది. దీంతో తగ్గిపోతున్న ఆయుధ నిల్వలను వీలైనంత వేగంగా తిరిగి నింపాలని అమెరికా రక్షణ శాఖ.. ఆయుధ తయారీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు స్పష్టమైన ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించింది. ఏళ్ల తరబడి సమయం పడుతుందని చెబితే కుదరదని.. ఇప్పుడే ప్రొడెక్షన్ పెంచేందుకు మార్గాలు వెతకాలని తేల్చి చెప్పింది. అసలు అమెరికా ఆయుధ నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి..? కీలకమైన పేట్రియాట్ (Patriot), థాడ్ (THAAD) ఇంటర్‌సెప్టర్లు ఎంతమేర తగ్గాయి..? వాటిని తిరిగి నింపడం ఎందుకు అంత కష్టంగా మారింది..? ఈ స్టోర్లీలో క్లియర్‌గా తెలుసుకుందాం.

ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు ఆయుధపరంగానే కాదు.. ఆర్థికంగానూ భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు.. ఇరాన్‌ దాడులను అడ్డుకునేందుకు అమెరికా వేల కోట్ల విలువైన ఆయుధాలను ఖర్చు చేసింది. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో.. మిలిటరీ బేస్‌లు, సైనిక బలగాలను రక్షించుకోవడానికి భారీగా ఎయిర్‌ డిఫెన్స్‌ ఆయుధాలను రంగంలోకి దించింది. ఇరాన్‌ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసిన ప్రతిసారీ.. వాటిని గాల్లోనే అడ్డుకునేందుకు పేట్రియాట్, THAAD వంటి అడ్వాన్స్‌డ్ ఇంటర్‌సెప్టర్స్‌ను ప్రయోగించింది. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగిస్తుంటే.. వాటిని అడ్డుకోవడానికి అమెరికా అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్స్‌ను వాడాల్సి వచ్చింది. ఇలా ఒక్కో దాడిని అడ్డుకునే కొద్దీ.. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఈ స్టాక్ మరింత క్షీణించి.. ఇప్పుడు అదే అమెరికాకు వెపన్ షార్టేజ్ రూపంలో సవాల్‌గా మారింది.

అమెరికా ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో తగ్గిపోయాయో.. పేట్రియాట్, THAAD లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్–CSIS అంచనాల ప్రకారం.. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర సుమారు 2,330 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్స్‌ ఉండేవి. కానీ ఏప్రిల్‌ నాటికి ఆ సంఖ్య 1,030కి పడిపోయింది. అక్కడితో ఆగకుండా.. ఇప్పుడు మరింత తగ్గి 827కి చేరింది. THAAD విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధానికి ముందు 452 ఇంటర్‌సెప్టర్స్‌ ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 234 నుంచి 278 మధ్యలో ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. అంటే యుద్ధానికి ముందు ఉన్న నిల్వతో పోలిస్తే.. THAAD ఇంటర్‌సెప్టర్స్‌ కూడా దాదాపు 38 శాతం మేర తగ్గిపోయాయి. ఈ సంఖ్యలు చూస్తే.. అమెరికా వెపన్ స్టాక్స్ పై యుద్ధం ఎంత ఒత్తిడి పెంచిందో స్పష్టంగా అర్థమవుతుంది.

Also Read : కొలంబియాలో భారీ భూకంపం : 111 మంది మృతి.. శిథిలాల కింద నివాసితులు!

ఇవి కేవలం నంబర్స్‌లా కనిపించొచ్చు. కానీ యుద్ధంలో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎందుకంటే శత్రువు నుంచి వచ్చే ప్రతి మిస్సైల్, డ్రోన్‌ను గాల్లోనే అడ్డుకోవాలంటే ఇంటర్‌సెప్టర్ అవసరం. ఒకసారి దాన్ని ప్రయోగించామంటే.. అది అక్కడితో అయిపోయినట్టే. మళ్లీ దాని స్థానంలో కొత్త మిస్సైల్ రావాలి. దీంతో ప్రతి దాడిని అడ్డుకునే కొద్దీ అమెరికా స్టాక్ తగ్గుతూనే ఉంటుంది. ఒకవేళ దాడుల సంఖ్య మరింత పెరిగితే.. ఉన్న ఇంటర్‌సెప్టర్స్‌ను ఎక్కడ ఉపయోగించాలి.. ఏ టార్గెట్‌ను ముందుగా అడ్డుకోవాలి.. ఎక్కడ స్టాక్‌ను కాపాడుకోవాలి.. అన్నది కూడా కీలకంగా మారుతుంది. అందుకే ఇంటర్‌సెప్టర్ స్టాక్ తగ్గడం అనేది కేవలం సంఖ్యల సమస్య కాదు.. యుద్ధంలో అమెరికా ఎదుర్కొంటున్న కీలకమైన వ్యూహాత్మక సవాల్.

అందుకే ఇప్పుడు పెంటగాన్ ఆయుధ నిల్వలను పెంచడంపై ఫోకస్ పెట్టింది. సైనికులకు అవసరమైన వెపన్స్ స్టాక్స్‌ను పెంచుతున్నామని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సియాన్‌ పార్నెల్‌ తెలిపారు. ఇది భారీ స్థాయి సైనిక ఆధునీకరణలో భాగమని తెలిపారు. అంటే ఇరాన్‌ దాడులను ఎదుర్కోవడంతో పాటు.. యుద్ధంలో ఖర్చవుతున్న ఆయుధాలను తిరిగి స్టాక్స్‌లోకి తీసుకురావడం కూడా అమెరికా ప్రాధాన్యతగా మారింది.

అయితే.. ఆయుధ నిల్వలను పెంచడం ఒక ఎత్తయితే.. వాటిని వేగంగా తిరిగి తయారు చేయడం మరో పెద్ద సవాల్‌. ఒక ఇంటర్‌సెప్టర్స్‌ను ఫైర్ చేయడానికి కొన్ని సెకండ్స్ చాలు. కానీ కొత్త మిస్సైల్‌ను తయారు చేసి స్టాక్స్‌లోకి తీసుకురావడానికి నెలలు.. కొన్ని సందర్భాల్లో ఏళ్లు పడొచ్చు. అంటే.. యుద్ధంలో వెపన్స్ ఖర్చయ్యే వేగానికి, ప్యాక్టరీల్లో అవి తయారయ్యే వేగానికి మధ్య భారీ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను తగ్గించడమే ఇప్పుడు అమెరికా ముందున్న అసలు లక్ష్యం. అందుకే డిఫెన్స్ కంపెనీలపై ప్రొడెక్షన్ కెపాసిటీ పెంచాలని ఒత్తిడి తెస్తోంది. అయితే ప్రొడెక్షన్ పెంచడం అంత ఈజీ కాదు. కొత్త మిషనరీ, మ్యాన్‌పవర్, ముడి పదార్థాలు, సప్లయర్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్.. అన్నీ అందుబాటులోకి రావాలి. వీటిలో ఏ ఒక్క కీలక భాగాలు సరఫరాలో ఆలస్యం జరిగినా.. దాని ప్రభావం మొత్తం ప్రొడెక్షన్ పై పడుతుంది. అందుకే పెంటగాన్ కేవలం మిస్సైల్ ప్రొడెక్షన్‌‌ను పెంచడం మీదే కాదు.. మొత్తం డిఫెన్స్ సప్లై చైన్ ను వేగంగా విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.

ఈ ప్రయత్నాల్లో భాగంగా.. అమెరికా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. పేట్రియాట్ PAC-3 MSE ఇంటర్‌సెప్టర్లు ఉత్పత్తిని పెంచేందుకు లాక్‌హీడ్ మార్టిన్‌తో 58.6 బిలియన్‌ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 నుంచి 2032 వరకు కొనసాగే ఈ డీల్‌లో భాగంగా.. 2030 నాటికి పేట్రియాట్ మిస్సైల్ ప్రొడెక్షన్ కెపాసిటీని మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. ఇప్పటివరకు యుద్ధంలో ఖర్చైన మిస్సైల్‌ను భర్తీ చేయడమే కాదు.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద వెపన్స్ స్టాక్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నది అమెరికా ప్లాన్.

Also Read : రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 12 మంది మృతి.. 39 మందికి గాయాలు

కానీ.. ఈ కెపాసిటీ పెంపు ఫలితం వెంటనే కనిపించదు. కొత్త సౌకర్యాలు, ప్రొడెక్షన్ లైన్స్, కీలక భాగాలు.. అన్నింటినీ పెంచడానికి సమయం పడుతుంది. అందుకే యుద్ధంలో ఖర్చైన ప్రతి మిస్సైల్‌ను వెంటనే రీప్లేస్ చేయడం సాధ్యం కాదు. CSIS అంచనాల ప్రకారం.. తగ్గిపోయిన స్టాక్స్‌ను పూర్తిగా తిరిగి నిర్మించుకోవడానికి అమెరికాకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే పెంటగాన్ ఆలస్యం చేయకుండా ప్రొడెక్షన్ పెంపుపై ప్లాన్స్ కోరుతోంది. ఈ నేపథ్యంలో.. అమెరికా రక్షణ శాఖ ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్ విధించింది. ఏ సిస్టమ్స్‌కు ప్రేయారిటీ ఇస్తారు..? ఎంత కెపాసిటీ పెంచగలరు..? ఎంత వేగంగా అవుట్ పుట్ పెంచగలరు..? అనే వివరాలతో పూర్తి ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. ఏళ్ల సమయం పడుతుందని చెప్పి చేతులు ఎత్తేయడానికి వీల్లేదని.. వీలైనంత త్వరగా ప్రొడెక్షన్ పెంచాల్సిందేనని పెంటగాన్ స్పష్టం చేసింది.

అయితే.. వెపన్స్ ప్రొడెక్షన్ పెంచాలంటే మరో పెద్ద సమస్య ఉంది. అదే ఫండింగ్. కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి.. మిషనరీ పెంచాలి.. మ్యాన్‌పవర్ తీసుకోవాలి.. ముడి పదార్థాలు కొనాలి.. ఇవన్నీ చేయాలంటే భారీగా డబ్బు అవసరం. కానీ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ పెంపుపై కాంగ్రెస్‌లో పూర్తి ఏకాభిప్రాయం లేదు. రక్షణ కేటాయింపులను 90,000 కోట్ల డాలర్ల నుంచి 1,50,000 కోట్ల డాలర్లకు పెంచే ప్రతిపాదనపై శాసనకర్తల్లోనే వ్యతిరేకత ఉంది. దీంతో ఒకవైపు పెంటగాన్ ప్రొడెక్షన్ పెంచాలని ఒత్తిడి తెస్తుంటే.. మరోవైపు దానికి అవసరమైన భారీ ఫండింగ్ విషయంలో కాంగ్రెస్ లోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి అమెరికా ఆయుధ నిల్వలను భర్తీ చేయడాన్ని మరింత కష్టంగా మారుస్తోంది.

ఇక ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న మాటలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికా దగ్గర ఆయుధాల కొరత ఉందన్న విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు. తమ వద్ద కుప్పలుతెప్పలుగా వెపన్స్ ఉన్నాయని.. అవసరమైనప్పుడు షిప్పుల్లో తరలించేందుకు కూడా భారీగా ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.

మొత్తంగా అమెరికా దగ్గర వెపన్స్ పూర్తిగా అయిపోలేదు అన్నది నిజమే. కానీ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే.. ఎంత స్టాక్ ఉందన్నదానికంటే.. ఖర్చైన వెపన్స్‌ను ఎంత వేగంగా తిరిగి తయారు చేయగలరన్నదే అసలు విషయం. మరి 3 వారాల డెడ్‌లైన్ తర్వాత ఆయుధ కంపెనీలు ఎలాంటి ప్లాన్స్ ఇస్తాయి..? ప్రొడెక్షన్ ఎంత వేగంగా పెరుగుతుంది..? తగ్గిపోయిన పేట్రియాట్, THAAD స్టాక్స్‌‌ను అమెరికా ఎంత త్వరగా తిరిగి నింపుకోగలదు..? అనేదే రాబోయే రోజుల్లో తేలనుంది.