
ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తూ ప్రపంచాన్ని ఇంధన సమస్యకు గురిచేస్తున్న అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో తన సొంత సైన్యంపైనే విరుచుకుపడుతున్నాడు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారిని జైళ్లలో పెడుతున్నారు. ఒక వైపు అమెరికా సైన్యంలోకి కొత్తగా యువతను ఆకర్షించేందుకు ప్రకటనల్లో ‘కుటుంబాలకు లభించే వలస ప్రయోజనాల’ గురించి పెద్దఎత్తున గొప్పలు చెబుతున్న ట్రంప్.. మరోవైపు తమ లీగల్ స్టేటస్‌ను సరిదిద్దుకునే పనిలో ఉన్న సైనికుల కుటుంబ సభ్యులను నెలల తరబడి డిటెన్షన్ సెంటర్లలో బంధిస్తుండటం చర్చనీయంశంగా మారింది.
ఒకవైపు అమెరికన్ సైనికులు దేశ సరిహద్దుల్లో, విదేశాలలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటే.. మరోవైపు వారి సొంత ఇళ్లలోనే భయానక వాతావరణం నెలకొనడం వారిని జీర్ణించుకోనివ్వడం లేదు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ తన పాలనా కాలంలో అమలు చేస్తున్న పలు కఠినమైన వలస విధానాల ప్రభావం నేరుగా అమెరికన్ సైనికుల కుటుంబాలపై పడుతోంది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) జరిపిన ఒక దర్యాప్తు నివేదికలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సైన్యం లో విధులు నిర్వహిస్తున్న 50 మందికి పైగా అమెరికా సైనికులకు చెందిన తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అంతేకాదు, వీరిలో కనీసం 6 గురిని అమెరికా నుంచి డిపోర్ట్ (దేశం నుంచి బహిష్కరించడం) చేయడం గమనార్హం. మరో 8 మందికి పైగా కుటుంబ సభ్యులు నేటికీ ఫెడరల్ ఇమిగ్రేషన్ కస్టడీలోనే మగ్గుతున్నారు.
ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఈ సైనికుల కుటుంబ సభ్యుల్లో చాలామందికి సరైన వీసా లేదా గ్రీన్ కార్డ్ లేదు. వారు చట్టపరమైన హోదాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఇంటిలోని ఒక వ్యక్తి ఆ దేశ సైన్యంలో ఉంటే.. ఆ కుటుంబంలోని మరో వ్యక్తి అక్రమ వలసదారుడు ఎలా అవుతారనే ప్రశ్న ఇక్కడ తలెత్తడం సర్వసాధారణం. వాస్తవానికి దీని వెనుక అనేక కోణాలున్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు.. ఒక సంతానం అమెరికాలో జన్మిస్తే ఆ వ్యక్తి అక్కడి పౌరుడవుతాడు, తద్వారా సైన్యంలో సేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సైనికుడి తల్లిదండ్రుల స్టేటస్ మాత్రం ఇంకా అక్రమ వలసదారుల లిస్టులోనే ఉండిపోతుంది. అలాగే, గ్రీన్ కార్డ్ రెన్యూవల్ చేసుకోని చాలా మంది కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
Also Read : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
News Alert! Trump administration has detained more than 50 spouses, parents of US troops in immigration crackdown, AP review finds
— Press Trust of India (@PTI_News) August 5, 2026
అమెరికాలో దేశసేవ చేసే సైనికుల సమీప బంధువులకు డిపోర్టేషన్ (బహిష్కరణ) నుంచి రక్షణ కల్పించాలనే విషయంలో డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీల మధ్య దశాబ్దాలుగా ఒక ఏకాభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిబంధనను ఆ రెండు పార్టీలు పూర్తిగా గాలికొదిలేశాయి. ఈ విధానం మూలంగా సైనిక సన్నాహాలపై, సైనికుల మనైస్థైర్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ చెందిన సైనిక కార్యకలాపాలతో అమెరికా సైన్యం బిజీగా ఉన్న ఇలాంటి తరుణంలో.. సైనికులు తమ కుటుంబాల భద్రత గురించి ఆందోళన చెందాల్సి రావడం వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లల బాగోగులు చూసుకోవడానికి, భార్య/భర్తలను విడిపించుకోవడానికి చాలా మంది జవాన్లు సెలవులు పెట్టి కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంతో వారి విధుల్లో జాప్యం ఏర్పాడుతోంది.
‘నా భార్యే కస్టడీలో ఉన్నప్పుడు, నేను విధుల్లో ఎలా శ్రద్ధ పెట్టగలను?’ ఇది టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్‌లో పనిచేస్తున్న అమెరికా ఆర్మీ సర్జెంట్ హెదర్ లియోనెల్ టూర్సియోస్ జువారెక్స్ ఆవేదన ఈ చేదు నిజానికి అద్దం పడుతోంది. జూలై నెలలో తన భార్యను 6 ఏళ్ల కూతురు ముందే వాల్‌మార్ట్ స్టోర్ వెలుపల పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. హెదర్ మాట్లాడుతూ, “నా భార్య ఏ స్థితిలో ఉంది, నా చిన్నారి కూతురి పరిస్థితి ఏమిటి అని ప్రతిక్షణం ఆందోళన చెందుతుంటే.. నేను నా సైనిక వృత్తిపై ఎలా దృష్టి పెట్టగలను?” అని ఆయన వాపోవడంలో అర్థముంది. అయితే, కొన్ని సందర్భాల్లో సైనికుల కుటుంబ సభ్యుల అరెస్ట్‌లపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైనప్పుడు.. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వెన్ ములిన్ స్వయంగా జోక్యం చేసుకుని వారిని విడుదల చేయించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కనుమరుగైన ప్రభుత్వ గణాంకాలు.. దర్యాప్తులో బట్టబయలైన నిజాలు
ఇదిలా ఉంటే సైనిక కుటుంబాల అరెస్ట్‌లకు సంబంధించి తాము ఎలాంటి ప్రత్యేక డేటాను నిర్వహించడం లేదని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసోసియేటెడ్ ప్రెస్ (AP).. ఇమిగ్రేషన్ జస్టిస్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ‘హెబియస్ డాకెట్స్’ ద్వారా వేలాది కోర్టు పత్రాలు, మీడియా నివేదికలు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ సమాచారాన్ని సేకరించడం విశేషం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కుటుంబాల వాస్తవ సంఖ్య 51 కన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ఏదేమైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా : షేక్ హసీనా ఎమోషనల్ కామెంట్స్!
కాగా, ఈ వ్యవహారంపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS)ను వివరణ కోరగా.. చాలా కేసులపై వారు వ్యక్తిగతంగా స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. అయితే, అదుపులోకి తీసుకున్న వారిలో కనీసం 7 గురిని గతంలోనూ అమెరికా నుంచి వెళ్లగొట్టామని, 8 మందిపై పాత డిపోర్టేషన్ ఉత్తర్వులు ఉన్నాయని, కనీసం ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డ్రగ్స్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఏజెన్సీ వాదించడం వారి కఠిన వైఖరిని వెల్లడిస్తోంది.









