
Iran-Israel War : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇప్పటికే ఘర్షణలు కొనసాగుతుండగా, మరోవైపు దుబాయ్‌లోని కీలక పారిశ్రామిక ప్రాంతాలపై దాడులు జరగడంతో పరిస్థితి మరింత విషమించింది. ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్‌బొల్లా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ ప్రతీకార దాడుల్లో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. మరోవైపు, లెబనాన్‌లోని మజ్దల్ గ్రామంలో జరిగిన ఐఈడీ (IED) పేలుడులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు, ఇదే దాడిలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో హమాస్ నిరాయుధీకరణ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టించుకోలేదు. అంతేకాక ట్రంప్ ప్రతిపాదనను మేం అంగీకరించబోం. అది మా ప్రణాళిక కాదు. గాజా నుంచి మా బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని ని నెతన్యాహు తేల్చిచెప్పడం తో ఇరుదేశాల మధ్య సమన్వయం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
Also Read : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
కాగా, ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఒమన్‌తో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధృవీకరించడం గమనార్హం.
ఇదిలా ఉండగా యూఏఈలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరవై నిమిషాల వ్యవధిలోనే కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించడంతో యూఏఈ తీర ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇరాన్-లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, యెమెన్ చేసిన క్షిపణి దాడి మూలంగానే ఈ విధ్వంసం జరిగినట్లు ప్రసార మాధ్యమాలు పేర్కొంటున్నాయి. కాగా, ఇంధన నిల్వలు, బదిలీ గిడ్డంగికి సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లు నాసా (NASA) చిత్రాల పరిశీలనలోనూ స్పష్టమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, జెబెల్ అలీ అనేది దుబాయ్‌లో అత్యంత వ్యూహాత్మకమైన ఓడరేవు కావడం గమనార్హం. అంతేకాక, స్వేచ్ఛావాణిజ్య మండలి కలిగి ఉన్న ప్రాంతం కూడా. ఇక్కడ 150కి పైగా దేశాలకు చెందిన దాదాపు 10,000లకు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కాకుండా అల్‌మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రహదారులతో అనుసంధానం కలిగి ఉండటం వల్ల ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటిది. ఇటువంటి ప్రాంతంపై దాడి జరగడం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్ధం పడుతోంది.
Also Read : ఏదేమైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా : షేక్ హసీనా ఎమోషనల్ కామెంట్స్!









