సైబీరియాలోని అత్యంత రహస్యకరమైన యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసే అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియా బయటకు లీక్ అయిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ల్యాబ్‌‌లో పరిశోధనలు జరుగుతున్న టైమ్‌‌లో ప్రమాదవశాత్తు ఓ టెస్ట్ ట్యూబ్ పగిలిపోవడం, ఆ వెంటనే అక్కడ పనిచేసే 28 ఏళ్ల మహిళా ల్యాబ్ టెక్నీషియన్ షిపిలోవా అనుమానాస్పదంగా చనిపోవడంతో రష్యా రహస్య బయోవెపన్ ప్రయోగాల గుట్టు రట్టయినట్లయింది.

ప్లేగు అనేది యెర్సినియా పెస్టిస్ అనే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటువ్యాధి. అయితే దీనికి బ్లాక్ డెత్ అని పేరుంది. 14వ శతాబ్దంలో ఈ వ్యాధి విజృంభించి ఐరోపా జనాభాలో ఏకంగా 60 శాతాన్ని తుడిచిపెట్టేసింది. సాధారణంగా ఇది ఎలుకలు, ఇతర చిన్న కీటకాలు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. బాధితులు దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల ద్వారా గాలిలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సరైన టైమ్‌కి ట్రీట్‌మెంట్ అందకపోతే కొద్ది రోజుల్లోనే ప్రాణాలు తీసేంత డేంజరస్ డిసీజ్ ఇది.

ఎలా తయారు చేశారు?
సోవియెట్ యూనియన్ కాలంలో శత్రు దేశాలపై ప్రయోగించడానికి రహస్యంగా జీవాయుధ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే సైబీరియా, మంగోలియా బోర్డర్ దగ్గర ఈ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు దాదాపు 80 ల్యాబ్‌లను నిర్మించారు. బయటకు ప్రజారోగ్య రక్షణ అని చెప్పినప్పటికీ.. రష్యా ఆర్మీ కోసం ఇక్కడ ప్లేగు, ఆంథ్రాక్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాను సేకరించి వాటిని ఆయుధాలుగా మార్చే ప్రయోగాలు చేశారు. 1991లో సోవియెట్ యూనియన్ కూలిపోయాక ఈ ల్యాబ్‌లు మూతపడ్డాయి. కానీ ఇటీవలి కాలంలో రష్యా మళ్లీ ఈ ప్రయోగాలను రహస్యంగా మొదలుపెట్టిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది?
ల్యాబ్‌లో రీసెర్చ్ జరుగుతున్న సమయంలో ప్లేగు బ్యాక్టీరియా ఉన్న ఒక టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తు కిందపడి పగిలిపోయింది. దీంతో ఆ లైవ్ బ్యాక్టీరియా గాలిలోకి లీక్ అయ్యింది. అక్కడ డ్యూటీలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ షిపిలోవా దీని బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో ఈ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ లీక్ అయి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్యా ల్యాబ్ నుంచి ప్లేగు లీక్ కావడం అంతకంటే భయానక అంశమని అమెరికా సీఐఏ మాజీ డైరెక్టర్ మైక్ పాంపియో వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. రష్యా దాచకుండా నిజాలను బయటపెడితే.. లీకేజీని కంట్రోల్ చేయడానికి అవసరమైన మెడికల్ సాయం అందించేందుకు అమెరికా రెడీగా ఉందని ప్రకటించారు.