
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన వనరులపై దాడులు నిలిపివేస్తూ ఎనర్జీ సీజ్ఫైర్ ఒప్పందం అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే చమురు, విద్యుత్, గ్యాస్ వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పరం దాడులు చేసుకోవద్దని ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) స్పందిస్తూ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ ప్రకటించిన ఈ ఒప్పందం గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని, కేవలం మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని స్పష్టం చేశారు.
Also Read : మసులుతున్న పసిఫిక్ సముద్రం నీళ్లు.. ప్రపంచానికి సూపర్ ఎల్‌నినో ప్రళయం ముప్పు తప్పదా?
తనకు ముందస్తు సమాచారం లేకపోయినప్పటికీ ఇది ఒక మంచి విషయమేనని జెలెన్స్కీ అన్నారు. యుద్ధంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఏ రకమైన చర్యలు చేపట్టినా స్వాగతిస్తామని తెలిపారు. ఈ ఒప్పందానికి రష్యా కూడా నిజాయితీగా కట్టుబడి ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. తమ దేశంలోని ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు నిలిపివేస్తే తాము కూడా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను తక్షణమే ఆపేస్తామని వెల్లడించారు. ఇరుపక్షాల నుంచి సానుకూల చర్యలు ఉన్నప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్ చేసిన సీజ్ఫైర్ ప్రకటనపై రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనను తెలియజేయలేదు. అంతేకాకుండా ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాలపై రష్యా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల వల్ల దేశంలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నదని జెలెన్స్కీ వెల్లడించారు. అలాగే ఖర్కీవ్‌లోని ఒక షాపింగ్ షాపుపై జరిగిన దాడిలో ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడులపై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శాంతి ఒప్పందం గురించి మాటలు చెప్తుంటే మరోవైపు రష్యా ఈ రకమైన దాడులకు తెగబడటం దాని ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని మండిపడ్డారు. ఇకనైనా రష్యా తన దాడులను తక్షణమే ఆపకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు రష్యా తీరును గమనించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : పిచ్చెక్కిపోతారు: నీటిలో రయ్ రయ్.. SPA సీట్లతో కొత్త కారు.. కిర్రాక్ ఫీచర్లు..!









