
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ) ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఆయన అంత్యక్రియలను జూలై 4 నుంచి 9 వరకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం కేవలం ఇరాన్ దేశానికే పరిమితం కాకుండా, మధ్యప్రాచ్య రాజకీయాల్లోనే ఒక కీలక మైలురాయిగా మారబోతోంది.
టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ప్రారంభమయ్యే ఈ వీడ్కోలు వేడుకలు, ఆ తర్వాత శతాబ్దాల నాటి మతపరమైన కేంద్రమైన ఖోమ్ నగరానికి చేరుకుంటాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఇరాన్ సరిహద్దులు దాటి ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు కూడా పార్థివ దేహాన్ని తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. చివరగా జూలై 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని అత్యంత పవిత్రమైన ‘ఇమామ్ రెజా’ దర్గాలో ఆయన ఖనన సంస్కారాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక అంత్యక్రియలకు రష్యా, చైనా, టర్కీ, ఖతార్, ఇరాక్ వంటి పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయంగా దీనిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
Also Read : పశ్చిమాసిమాలో మరోసారి ఉద్రిక్తతలు… చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్
తెరపైకి ‘షాడో ప్రిన్స్’ మొజ్తబా ఖమేనీ: తొలిసారి బహిరంగంగా కనిపిస్తారా?
అలీ ఖమేనీ అంత్యక్రియల కంటే ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షిస్తోన్న అంశం.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తొలి బహిరంగ ప్రవేశం! తండ్రి మరణం తర్వాత ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన రహస్య ప్రాంతం నుంచే దేశాన్ని నడిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి ప్రత్యక్ష ప్రసంగాలు గానీ, వీడియో లేదా ఆడియో సందేశాలు గానీ విడుదల చేయలేదు.
ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఉన్న కాంపౌండ్‌పై జరిగిన దాడుల్లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరు మరణించగా,మొజ్తాబా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు ముఖమంతా కాలిపోయినట్లు ఆ దేశ మీడియా గతంలో వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండటం కోసం.. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా ఆయనను కలిసేందుకు వెళ్లడం లేదని వార్తలు వచ్చాయి. పాలనా వ్యవహారాల్లో మాత్రం మొజ్తాబా పేరు వినిపిస్తోంది. ఆయన పేరిటే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. కానీ సుదీర్ఘకాలంగా మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేలా అంత్యక్రియల్లో మొజ్తాబా కనిపిస్తారా..? అనే చర్చ మొదలైంది. అలీ ఖమేనీ మరణించిన తర్వాతే మొజ్తాబా (Mojtaba Khamenei)ను సుప్రీం లీడర్‌గా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన తండ్రి అంత్యక్రియల వేదికగా ఆయన ప్రపంచం ముందుకు వస్తారా? లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ బహిరంగ ప్రవేశం ఎందుకు కీలకం?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ అంత్యక్రియల వేదిక మొజ్తబా ఖమేనీకి ఒక పరీక్ష లాంటిది. ఒకవేళ మొజ్తబా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటే, తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడమే కాకుండా, తానే ఇరాన్ దేశ అత్యున్నత శక్తిని అని ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుంది. ఒకవేళ భద్రతా కారణాల వల్లో లేదా అనారోగ్యం వల్లో ఆయన హాజరుకాకపోతే.. ఆయన నాయకత్వ సామర్థ్యంపై, అధికార బదిలీ ప్రక్రియపై ఇరాన్ ప్రజల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ సందేహాలు మరింత బలపడతాయి.అమెరికా, ఇజ్రాయెల్‌తో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే తన అణు కేంద్రాలు, కీలక సైనిక స్థావరాల వద్ద అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ రాజకీయాల్లో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో గ్లోబల్ పాలిటిక్స్‌ను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.
జులై 5 నుంచి 9 వరకు ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మోదీ (PM Modi)ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనిని మన ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల మళ్లీ ఘర్షణలు భగ్గుమన్నాయి. ప్రస్తుతానికి అవి సద్దుమణిగినప్పటికీ.. ఈ ఉద్రిక్త వాతావరణంలో అలీ ఖమేనీ అంత్యక్రియలను యధావిధిగా కొనసాగిస్తారా..? వాయిదా వేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : వెనిజులాలో భూకంపం: తన ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డను కాపాడిన ఫుట్‌బాలర్ భార్య!
ప్రపంచ నేతలు హాజరు..
ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాల అనంతరం ఖోమ్‌లో మతపరమైన నివాళులు, ఆపై మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననం జరగనుంది. ఈ కార్యక్రమాలకు పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంత్యక్రియలు అత్యంత సున్నితమైన కార్యక్రమంగా మారాయి.
ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఇప్పటికే తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అత్యున్నత స్థాయి అప్రమత్తత కొనసాగుతోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, మతపరమైన నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.









