Earthquake
Earthquake

జపాన్‌లోని బోనిన్ దీవుల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఆకస్మిక భూకంపం వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సాధారణంగా 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు భవనాలు, ఇళ్లకు తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటిది 6.3 తీవ్రతతో నమోదు కావడం వల్ల అక్కడి కట్టడాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత భద్రతా దళాలు, అధికారులు అప్రమత్తమయ్యారు.

సాధారణంగా భూమి లోపల నిరంతరం కదులుతూ ఉండే ఏడు ప్రధాన ప్లేట్లు ఉంటాయి. ఈ ఫలకాలు పదేపదే ఒకదానికొకటి ఢీకొనడం వల్ల వాటి అంచులు తీవ్ర ఒత్తిడికి గురై వంగిపోతాయి. ఇలా భూమి అడుగున ఒత్తిడి పరిమితి దాటినప్పుడు ఆ ఫలకాలు విరిగిపోయి వాటిలోని భారీ శక్తి ఒక్కసారిగా అలల రూపంలో బయటకు విడుదలవుతుంది. ఈ శక్తి భూ ఉపరితలానికి చేరినప్పుడే భూమి తీవ్రంగా కంపించడం జరుగుతుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. సాధారణంగా 2.0 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలను సూక్ష్మ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు, చాలామంది ఇవి వచ్చినట్లు కూడా గ్రహించలేరు. అయితే రిక్టర్ స్కేలుపై 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత నమోదైతే మాత్రం వాటిని అత్యంత ప్రమాదకరమైన భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి వల్ల పెద్ద ఎత్తున భవనాలు కూలిపోవడం, ప్రాణనష్టం జరగడం వంటి తీవ్ర విధ్వంసాలు చోటుచేసుకుంటాయి.