
US Labour Certification : అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీలను అమెరికా ప్రభుత్వం పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీలపైనా ఇదే చర్య తీసుకున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది.
అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ సోండర్లింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కంపెనీలపై ఫెడరల్ స్థాయిలో జరుగుతున్న దర్యాప్తులు, విదేశీ ఉద్యోగులను నియమించే విధానంపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కంపెనీలు తప్పు చేశాయని తేలిపోయిందని కాదు.. ప్రస్తుతం ఆరోపణలు, దర్యాప్తుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇందులో మైక్రోసాఫ్ట్‌పై సోండర్లింగ్ ప్రత్యేకంగా ఆరోపణలు చేశారు. 2025లో సుమారు 6 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిన తర్వాత, అమెరికాలో అర్హులైన ఉద్యోగులు దొరకడం లేదని పేర్కొంటూ విదేశీ ఉద్యోగుల కోసం వేలాది దరఖాస్తులు చేసిందని ఆరోపించారు. మైక్రోసాఫ్ట్‌కు 6 వేలకు పైగా H-1B వీసాలు ఆమోదం పొందగా, 3,682 PERM దరఖాస్తులు దాఖలయ్యాయని ఆయన తెలిపారు. వీటిలో దాదాపు వెయ్యి దరఖాస్తులు తొలగించిన అమెరికన్ ఉద్యోగులు చేసిన పనులకు దగ్గరగా ఉన్న పోస్టుల కోసం ఉన్నాయని ఆరోపించారు.
అసలు PERM అంటే ఏమిటంటే..
అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా తమ సంస్థలో కొనసాగించేందుకు, వారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియలో స్పాన్సర్ చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన ప్రక్రియ. ఇందులో ఆ ఉద్యోగానికి సరిపోయే అమెరికన్ ఉద్యోగులు అందుబాటులో లేరని కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది. ఇక H-1B వీసా వేరు. అమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా పనిచేయించేందుకు ఈ వీసా ఉపయోగిస్తారు.
PERM మాత్రం ఉద్యోగిని శాశ్వతంగా అమెరికాలో కొనసాగించే గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ. ఈ నిర్ణయంతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా PERM ప్రక్రియ మొదలుపెట్టాల్సిన ఉద్యోగులకు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆమోదం పొందిన గ్రీన్ కార్డ్ కేసులు లేదా I-140 ఆమోదాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. అలాగే ఈ చర్యతో H-1B వీసాలన్నీ ఒక్కసారిగా రద్దు చేసినట్లు కూడా కాదు.









