
మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ఆయుధాల కోసం పూర్తిగా ఇరాన్పైనే ఆధారపడ్డ యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తున్నారు. చైనా నుంచి తెప్పించిన విడిభాగాలతో వారు సొంతంగానే ప్రమాదకరమైన హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేస్తున్నారు. కాన్ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థ ఇచ్చిన రిపోర్టులో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హౌతీలు చైనాలోని ఒక ఏరోస్పేస్ కంపెనీ నుంచి క్షిపణి తయారీకి కావలసిన విడిభాగాలను రహస్యంగా తెప్పిస్తున్నారు. గతంలో యెమెన్ అధికారులు పట్టుకున్న రెండు ఆయుధ సరుకుల్లో ఈ విషయం బయటపడింది. ఆ సరుకుల్లో క్షిపణి మోటార్లు, ఫ్రేమ్ ముక్కలు, రెక్కలు, వేడిని తట్టుకునే షీల్డ్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా కంపెనీలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఈ సరఫరాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఇరాన్కు చెందిన ఖేబర్ షకేన్ క్షిపణి పోలికలతోనే హౌతీలు ఈ కొత్త క్షిపణులను తయారు చేస్తున్నారు. ఈ క్షిపణి 1,900 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. అంటే యెమెన్ నుంచి ప్రయోగిస్తే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇది గంటకు ఏకంగా 9,656 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అందుకే ఇది రక్షణ వ్యవస్థల కంటపడని హైపర్సోనిక్ క్షిపణిగా మారింది. లక్ష్యానికి దగ్గరవుతున్న సమయంలో ఇది తన దిశను మార్చుకోగలదు. దీనివల్ల అమెరికాకు చెందిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా వీటిని గాల్లో అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఎర్ర సముద్రంలో ఉండే అమెరికా నావికా స్థావరాలు, యుద్ధనౌకలపై ఇవి వినాశకర దాడులు చేసే ప్రమాదం ఉంది. అయితే చైనా వస్తువులు హౌతీల చేతికి చిక్కడం ఇదే మొదటిసారి కాదు. గత ఆగస్టులో అమెరికా నావికా స్థావరంపై దాడి చేయడానికి హౌతీలు వాడిన షాహెద్ డ్రోన్ల ఇంజన్లు కూడా చైనా ఫ్యాక్టరీలవేనని తేలింది. చైనాకు చెందిన కొన్ని ప్రైవేట్ కంపెనీలు యుద్ధానికి, శాంతికి రెండింటికీ ఉపయోగపడే విడిభాగాలను అమ్ముతున్నాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇరాన్కు చైనానే టార్గెట్ సమాచారం అందిస్తోందనే అనుమానాలు కూడా ఉన్నాయి.
హౌతీలు ఇప్పటికే ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. ఒకవేళ వారు సొంతంగా ఈ 1,900 కిమీ రేంజ్ క్షిపణులను తయారు చేస్తే ఇరాన్ నుంచి ఆయుధాలు రాకపోయినా వీరు స్వతంత్రంగా దాడులు చేయగలరు. ఇప్పటికే దాడులతో సతమతమవుతున్న ఈ దేశాలకు ఈ మిస్సైల్స్ అతిపెద్ద ముప్పుగా మారతాయి. ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలు ఆగిపోతే, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి.









