
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్‌పై తనకున్న ప్రేమను వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలపై సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్లే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని ఇంతలా ఎలా నమ్ముతారని వాన్స్‌ను నిలదీశారు.
#WATCH : US Vice President JD Vance joked that the two most important people in his life are "an Indian and a Pakistani," referring to his wife, Usha Vance, and Pakistan's Army Chief Field Marshal Asim Munir.
Vance added that he has spoken with Munir more than almost anyone else… pic.twitter.com/iGuIv9s8bu— upuknews (@upuknews1) June 21, 2026
అసలు వివాదం ఏంటంటే?
స్విట్జర్లాండ్ చర్చల్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. మేము పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నామన్నారు. అక్కడితో ఆగకుండా పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని ప్రశంసించారు. నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం. అందులో ఒకరు భారతీయులు, మరొకరు పాకిస్తానీ అని అన్నారు. ఆ భారతీయులు తన భార్య ఉషా చిలుకూరి, ఆ పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ మునీర్ అని వాన్స్ అన్నారు. అయితే గత మూడు నెలల నుంచి తాను ఎక్కువగా మునీర్‌తోనే మాట్లాడానని వెల్లడించారు. దీంతో అమెరికా సెనేటర్లు వాన్స్‌పై మండిపడుతున్నారు. ఉగ్రవాద చరిత్ర ఉన్న దేశాన్ని.. అక్కడి ఆర్మీ చీఫ్‌ను ఇంతలా పొగడటం సెనేటర్లకు నచ్చడం లేదు. రిపబ్లికన్ సెనేటర్లయిన రిక్ స్కాట్, టిమ్ షీహీలు జేడీ వాన్స్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్, ఖతార్ దేశాలకు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన దశాబ్దాల నాటి చరిత్ర ఉందన్నారు. ఆ దేశాలు పశ్చిమాసియాలో నిజమైన శాంతిని కోరుకోవడం లేదని, ఇరాన్ చేస్తున్న ఉగ్రవాద ప్రచారానికి మద్దతు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని ఆరోపించారు.
మాజీ యూఎస్ నేవీ సీల్ అయిన సెనేటర్ టిమ్ షీహీ ఫాక్స్ కూడా వాన్స్‌పై మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పదేళ్లపాటు దాచిపెట్టింది ఇదే పాకిస్తాన్. తమ గూఢచార సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా జరిగే దాడులకు, ఇరాన్ దేశానికి వీరు నిధులు సమకూరుస్తున్నారు. అలాంటి దేశాన్ని నిష్పక్షపాత మధ్యవర్తిగా ఎలా చూస్తామని ప్రశ్నించారు. అలాగే ఖతార్ దేశం కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మనీలాండరింగ్ చేస్తోందని ఆరోపించారు.
శాంతి చర్చల విషయంలో పాకిస్తాన్, ఖతార్‌లను మాత్రమే ఉంచడం తప్పు అని సెనేటర్లు అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో అమెరికాకు నిజమైన నమ్మకస్థులైన భాగస్వాములు యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాలని, చర్చల్లో వారిని కూడా భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు.









