ఫ్రాన్స్‌లో విద్యార్థులు రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. పాఠశాలల్లో కనీస వసతులు లేవని, సిబ్బంది కొరతతో చదువు నాశనమవుతోందని ఆగ్రహిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. పరిస్థితులు చెయ్యి దాటిపోతుండటంతో విద్యాశాఖ మంత్రి ఎడ్వర్డ్ జెఫ్రే ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 500 ఉన్నత పాఠశాలలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమైన ఈ ఆందోళనలు పారిస్, మార్సెయిల్, స్ట్రాస్‌బర్గ్ వంటి ప్రధాన నగరాలకు వేగంగా వ్యాపించి మాక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచాయి.

ఈ ఉద్యమానికి ప్యారిస్ సమీపంలోని సెయింట్-ఎక్సూపెరీ హైస్కూల్ కేంద్ర బిందువుగా మారింది. సెప్టెంబర్ 17న ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి తమ స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ మొదలుపెట్టిన ఈ పోరాటం కొద్దిరోజుల్లోనే కార్చిచ్చులా దేశమంతటా పాకింది. అయితే శాంతియుతంగా మొదలైన ఈ నిరసనల్లోకి హింస చేరింది. నిరసనకారులు రోడ్లు, చెత్తకుండీలకు నిప్పుపెడుతూ విధ్వంసానికి దిగారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు ఉపయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 24 పాఠశాలలు ధ్వంసం కాగా.. 40 మంది ప్రిన్సిపాల్స్‌తో సహా 65 మంది సిబ్బంది గాయపడ్డారు. భద్రతా దళాలు ఏకంగా 4,000 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశాయి.

అసలు విద్యార్థులు ఇంతగా రోడ్డెక్కడానికి ప్రధాన కారణం అక్కడి విద్యా వ్యవస్థలో ఉన్న ఘోరమైన లోపాలే కారణమని చెప్పవచ్చు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా క్లాస్‌రూమ్‌లు లేవు. ఒక్కో తరగతిలో ఏకంగా 40 మందిని కూర్చోబెడుతున్నారు. అలాగే అర్హత కలిగిన ఉపాధ్యాయులు, నర్సులు, కౌన్సెలర్ల కొరత తీవ్రంగా ఉంది. సరైన ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేక దాదాపు 10 శాతం బోధనా సమయం వృథా అవుతోందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. దీనికితోడు వేసవి కాలంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నా స్కూళ్లలో ఏసీలు లేకపోవడంతో 40 డిగ్రీల ఎండలో మూసివున్న గదుల్లో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. అలాగే ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే సమయం వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులపై చూపించే వివక్ష వారి ఆగ్రహానికి కారణమయ్యాయి.

అయితే వామపక్ష నాయకుడు జీన్-లూక్ మెలెన్‌చోన్ ఓట్ల రాజకీయం కోసమే ఈ నిరసనలను వెనుకుండి నడిపిస్తున్నారని అధికార, మితవాద పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆందోళనల్లో పాలస్తీనా, అల్జీరియా జెండాలు కనిపించడం ఈ సందేహాలకు మరింత బలాన్నిచ్చింది. మరోవైపు తీవ్ర కుడిపక్ష నేత మెరీన్ లీ పెన్ ప్రాబల్యం పెరగడం, ఆర్థిక సంక్షోభం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హింసను సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 2027 బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆర్థిక లోటుతో బాధపడుతున్న మాక్రాన్ ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారింది.