Attack plan on UFC event : అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌’ వేదికగా జరగాల్సిన ఒక భారీ ఉగ్రదాడి కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో అట్టహాసంగా ‘యూఎఫ్‌సీ’ (UFC) ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రముఖ రాజకీయ నాయకులు, అగ్రశ్రేణి ప్రభుత్వ అధికారులు హాజరైన ఈ వేడుకనే లక్ష్యంగా చేసుకుని ప్రాణనష్టం కలిగించాలనే కొందరి ఘాతుక ప్రణాళికను ఫెడరల్ ఏజెంట్లు ముందే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ భారీ కుట్ర వెలుగుచూడటం వెనుక ఒక తల్లి చూపిన అప్రమత్తత,సామాజిక బాధ్యత అత్యంత కీలకంగా నిలిచాయి. నిందితుల్లో ఒకడైన ఒహాయో ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు టైసెన్ ప్రాపర్ ప్రవర్తనపై గత కొన్ని రోజులుగా అతని తల్లికి తీవ్ర అనుమానం వచ్చింది. అతడు ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో గూఢచర్యం, హిట్ అండ్ రన్ మిషన్ల గురించి సంభాషించడంతో పాటు రహస్యంగా భారీ మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేయడాన్ని ఆమె గమనించింది. కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని గ్రహించిన ఆ తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ నిందితుడిని అదుపులోకి తీసుకోగా వైట్‌హౌస్ దాడి గురించిన దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి.
ఈవెంట్ జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే ఈ భయంకరమైన కుట్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించాయని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ వెల్లడించారు. నిందితులు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పరస్పరం సంభాషించుకున్న దాదాపు 20 మందికి చెందిన టెక్స్ట్ మెసేజ్‌లను దర్యాప్తు అధికారులు విశ్లేషించారు. వీటిలో వైట్‌హౌస్‌కు సంబంధించిన హై-రెజల్యూషన్ ఫొటోలు, గూగుల్ మ్యాప్‌లు, భద్రతా వలయాలు , దాడి ముగిసిన తర్వాత అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకోవడానికి వీలున్న రహస్య మార్గాల గురించి వారు కూలంకషంగా చర్చించుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.
ఎఫ్‌బీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల ప్లాన్ అత్యంత క్రూరంగా ఉంది. మొదటగా పేలుడు పదార్థాలు అమర్చిన శక్తిమంతమైన డ్రోన్లను వైట్‌హౌస్ సమీపంలోని భవనాలపైకి ఎగురవేసి పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టించాలనుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రాణభయంతో భవనం వెలుపలికి పరుగులు తీసే నిరాయుధులైన జనసమూహం , ప్రముఖులపై సమీపంలో మాటువేసిన స్నైపర్లతో విచక్షణారహితంగా కాల్పులు జరపాలని వారు వ్యూహం రచించారు. సరైన సమయంలో ఈ కుట్రను అడ్డుకోలేకపోయి ఉంటే అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన భారీ ప్రాణనష్టం సంభవించేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
అయితే, ఈ విచారణలో మరొక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయం వెలుగుచూసింది. ఈ దాడి బృందంలోని నిందితులకు ఒకరితో ఒకరికి ముందస్తు వ్యక్తిగత పరిచయాలు కానీ, ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు కానీ లేవు. కేవలం ఇంటర్నెట్ వేదికగా వీరంతా ఏకమయ్యారు. వీరంతా తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఉన్నవారు, యూదు వ్యతిరేకులు కావడం గమనార్హం. ముఖ్యంగా, వివాదాస్పద లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అత్యంత రహస్య ఫైళ్లను బహిర్గతం చేసే విషయంలో ట్రంప్ యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరాశ, కోపంతో ఉన్న వీరంతా ఆ కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది.
ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ దాడి కుట్ర గురించి తనకు ముందే ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. అయితే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిని ఒక తీవ్రమైన “ఉగ్ర కుట్ర”గా అభివర్ణించారు. ఇది ఎవరో ఒకరిద్దరు పిచ్చివాళ్లు చేసిన పని కాదని, పూర్తి సమన్వయంతో, పక్కా ప్రణాళికతో దేశాన్ని దెబ్బతీయడానికి జరిగిన తీవ్రమైన ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం నిందితుల నుంచి అత్యాధునిక తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.