
ఈజిప్టు రక్షణ రంగం సరికొత్త అధ్యాయాన్ని ‘ఆక్టగాన్’ (State Strategic Command Headquarters)ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సైనిక ప్రధాన కార్యాలయంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ భవనంగా గుర్తింపు పొందిన అమెరికాలోని ‘పెంటగాన్’ను దాటింది. ఈజిప్ట్ రాజధాని కైరోకు తూర్పున కొత్తగా నిర్మిస్తున్న నూతన పరిపాలనా రాజధానిలో సుమారు 22,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ రక్షణ నగర సముదాయాన్ని రూపొందించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ ఈ కట్టడాన్ని అధికారికంగా ప్రారంభించి సాయుధ దళాల జెండాను ఎగురవేశారు. సైనిక దుస్తుల్లో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి.
ఆక్టగాన్ అనేది కేవలం ఒకే ఒక్క భవనం కాదు. అష్టభుజి ఆకారంలో రూపుదిద్దుకున్న 10 భారీ భవనాల సముదాయం. ఇందులో వెలుపలి వైపు ఎనిమిది అష్టభుజి భవనాలు ఉండగా మధ్య భాగంలో రెండు ప్రధాన కేంద్ర మంత్రిత్వ భవనాలు ఉన్నాయి. ఈ నిర్మాణంలో 50.5 మిలియన్ చదరపు అడుగులకు పైగా ఫ్లోర్ స్పేస్ అందుబాటులో ఉంది. ప్రాచీన ఈజిప్షియన్ థీబ్స్, కర్నాక్ దేవాలయాల శైలిని ప్రతిబింబించే భారీ రాతి స్థంభాలతో పాటు గ్రీకో-రోమన్ నిర్మాణ శైలిని సమ్మేళనం చేస్తూ దీనిని డిజైన్ చేశారు. పురాతన సంస్కృతికి, ఆధునిక రక్షణ సాంకేతికతకు ప్రతిరూపంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది.
అమెరికా వర్జీనియాలోని ‘పెంటగాన్’ ఐదు భుజాల పంచభుజి ఆకారంలో ఒకే భవనంగా ఉంటుంది. పెంటగాన్ ప్రాంగణం మొత్తం 29 నుండి 41 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఈజిప్టు ఆక్టగాన్ ఏకంగా 22,000 ఎకరాల్లో విస్తరించింది. విస్తీర్ణం పరంగా చూస్తే ఆక్టగాన్, పెంటగాన్ కంటే సుమారు 750 రెట్లు పెద్దది. పెంటగాన్‌లో అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యకలాపాలు సాగుతుంటే ఆక్టగాన్లో ఈజిప్టుకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ డిఫెన్స్ సహా అన్ని రక్షణ విభాగాలను ఒకే చోటికి తీసుకువచ్చారు.
ఆక్టగాన్ను కేవలం సైనిక కార్యాలయంగానే కాకుండా ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దారు. దేశ రక్షణ, సైనిక వ్యూహాలు, గూఢచర్యం, సురక్షిత సమాచార ప్రసారం, అత్యవసర సంక్షోభ నిర్వహణ వంటి ప్రక్రియలన్నీ ఒకే గొడుగు కింద పనిచేసేలా ఈ కమాండ్ నెట్వర్క్ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బంకర్లు, భూగర్భ డేటా సెంటర్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించారు.
ఈ భారీ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో స్వయంసమృద్ధి కలిగి ఉంటుంది. ఆర్మీ ప్రధాన విభాగాలు మాత్రమే కాకుండా సైనిక అకాడమీలు, అధికారుల నివాస సముదాయాలు, ఆధునిక ఆసుపత్రులు, హెలిప్యాడ్లు, శిక్షణ మైదానాలు, కఠినమైన భద్రతా వలయాలు ఇందులో భాగమయ్యాయి. యుద్ధ వాతావరణం లేదా జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశ పాలన, సైనిక నిర్ణయాలు ఇక్కడి నుంచే ఏకధాటిగా కొనసాగేలా మౌలిక సదుపాయాలు కల్పించారు.









