
Donald Trump : అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న వలసదారుల స్థానంలో అమెరికన్ సైనిక మాజీ ఉద్యోగులను నియమించాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. అక్రమంగా అమెరికాలో ఉంటూ ట్రక్కులు నడుపుతున్న చాలా మంది డ్రైవర్లు అసురక్షితంగా ఉన్నారని, వారి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన డ్రైవర్లపై త్వరలోనే చారిత్రాత్మక చర్యలు తీసుకోబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా మంది డ్రైవర్లకు ట్రాఫిక్ సంకేతాలు చదవడం రాదని, కొందరు మత్తుపదార్థాలకు బానిసలై ట్రక్కులు నడుపుతున్నారని ఆయన విమర్శించారు. “మాకు అక్రమ వలసదారులు వద్దు, వారి స్థానంలో మన సైనిక వీరులను ట్రక్కు డ్రైవర్లుగా నియమిస్తాం. వారికి ట్రక్కులు నడపడంపై శిక్షణ ఇస్తాం” అని ఆయన పేర్కొన్నారు. సైన్యంలో భారీ వాహనాలు నడిపిన ప్రతి అమెరికన్‌కు వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా వచ్చేలా కొత్త నిబంధనలు తెస్తామని తెలిపారు.
Also Read : పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథుని రథయాత్ర,, వేలాది మంది భక్తుల సమక్షంలో!
ఈ నిర్ణయం అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా ఉన్న వేలాది మంది భారతీయులపై, ముఖ్యంగా పంజాబ్ , హర్యానా రాష్ట్రాల నుండి వెళ్ళిన వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, అమెరికాలో సుమారు 1.3 లక్షల నుండి 1.5 లక్షల మంది డ్రైవర్లు పంజాబ్, హర్యానాలకు చెందిన వారే. వీరిలో ఎక్కువ మంది సిక్కులే కావడం గమనార్హం. వీరిలో చాలా మంది చట్టబద్ధంగా పౌరసత్వం లేదా వర్క్ పర్మిట్ కలిగి ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయ మూలాలున్న డ్రైవర్లు చిక్కుకోవడంతో, ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
అమెరికా ట్రక్కింగ్ రంగంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండటంతో, చాలా కాలంగా వలసదారులపైనే ఈ పరిశ్రమ ఆధారపడింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త చర్యల వల్ల ఇప్పటికే వలసదారులైన సుమారు 2 లక్షల మంది డ్రైవర్లు తమ లైసెన్స్‌లను కోల్పోయారు. ఈ కొత్త ప్రతిపాదనను అమలు చేయడం ద్వారా పబ్లిక్ సేఫ్టీని పెంచాలని, మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న డ్రైవర్లను ఏ విధంగా గుర్తిస్తారు, లైసెన్స్‌లను ఎలా రద్దు చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
Also Read : ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు: అక్టోబర్ 27న ఎన్నికలు!









