అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న తీవ్ర వివాదం వల్ల మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం ఫ్లోరిడాలోని ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, గతంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ తరహాలోనే ఇరాన్‌పై మరో సైనిక దాడి చేయవచ్చని సూచనలు చేశారు. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికా వైపు నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించాయి.

అమెరికా నుంచి ఊహించని రీతిలో సైనిక బెదిరింపులు రావడంతో ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఒకవేళ తమ దేశంపై అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి దాడులకు దిగినా చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పింది. తమ భూభాగంపై మళ్లీ దాడి జరిగితే ప్రతీకార చర్యగా గల్ఫ్ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి కింద ఉన్న ముఖ్యమైన సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తెంచివేస్తామని ఇరాన్ భద్రతా అధికారులు హెచ్చరించారు. తమ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే ఇకపై ఏ సరిహద్దులు లేకుండా విరుచుకుపడతామని, అక్కడున్న ఏడు ప్రధాన వైర్లను కత్తిరించడంతో పాటు వాటి మరమ్మతులకు కూడా ఆటంకం కలిగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

సముద్రం అడుగున ఉండే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలో దాదాపు 99 శాతం బాధ్యత వహిస్తాయి. ఇరాన్ బెదిరిస్తున్న హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ వ్యాప్త ఇంటర్నెట్ సమాచారంలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మాత్రమే ప్రయాణిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ ఇరాన్ నిజంగానే ఈ కేబుళ్లను దెబ్బతీస్తే ప్రపంచం మొత్తానికి ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోకపోయినా.. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల దేశాల్లో బ్యాంకింగ్ రంగానికి, ఆన్‌లైన్ పేమెంట్లకు, క్లౌడ్ సేవలకు, డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరోపా, ముస్లిం దేశాలు స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశాయి. టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై చర్చలు జరిపారు. కొత్తగా దాడులు జరిపితే యుద్ధం మరింత విస్తరించి ఆసియా, ఐరోపాలకు వ్యాపిస్తుందని, సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని టర్కీ పేర్కొంది. దాడుల వల్ల గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఫ్రాన్స్ హెచ్చరించింది. మరోవైపు ఈ గల్ఫ్ దేశాలు డేటా సెంటర్లు, కృత్రిమ మేధ సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఇటువంటి బెదిరింపులు సాంకేతిక రంగానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి.