Djibouti Boat Capsize
Djibouti Boat Capsize

ఆఫ్రికాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. జిబౌటి నుంచి యెమెన్‌కు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న వలసదారుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 116 మంది నీటిలో గల్లంతయ్యారు. అదే సమయంలో 80 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

సుమారు 305 మంది ప్రయాణికులతో వెళ్లిన బోటు.. జిబౌటీలోని ఓబోక్ నగరం సమీపంలో ఉన్న గుహేరే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ప్రకారం.. ప్రాణాలతో బయటపడినవారంతా.. ఇథియోపియా దేశస్థులేనని తెలిపింది. ఈ ఘటన అనంతరం సముద్రంలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు సహాయకచర్యలు చేపట్టారు.

ఇప్పటి వరకు 109 మృతదేహాలను వెలికితీశారు. అందులో 52 మంది పురుషులు.. 42 మంది మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 9 మంది బాలికలు, 6 మంది బాలురు ఉన్నారు. ఇక గల్లంతైన 116 మంది ప్రయాణికుల ఆచూకీ లభించలేదని తెలుస్తోంది.

బతుకుదెరువు కోసం ప్రమాదకరమైన సముద్రమార్గాలను ఎంచుకుంటున్న పేద కుటుంబాలు.. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంపై ఐఓఎమ్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.