Super El Nino : రాబోయే సూపర్‌ ఎల్‌నినో మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదిగా, తీవ్ర నష్టదాయకమైనదిగా మారవచ్చని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 140 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడని విధంగా పసిఫిక్ భూమధ్యరేఖా ప్రాంతంలో అసాధారణ స్థాయిలో వేడినీరు పేరుకుపోతోంది. ఈ వేడినీరే రాబోయే కాలంలో అత్యంత ఘోరమైన ఎల్‌నినో చక్రానికి ఇంధనంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భూగోళాన్ని ఈ ముప్పు నుంచి రక్షించేందుకు శాస్త్రవేత్తల బృందం ఒక వినూత్నమైన, అంతే వివాదాస్పదమైన పరిష్కారాన్ని తెరపైకి తెచ్చింది.
సముద్రాల్లో వేడినీరు ప్రమాదకరంగా పేరుకుపోకుండా నిరోధించడానికి ‘సూర్యుడిని మసకబార్చడం’ (Dimming the Sun) అనే సరికొత్త వ్యూహాన్ని పరిశోధకులు ప్రతిపాదించారు. వాతావరణంలోకి వచ్చే సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలలో దాదాపు 75 శాతం మేర సంభవించే తీవ్రమైన ఉష్ణ తరంగాల (Marine Heatwaves) నుంచి జలచరాలను, పర్యావరణాన్ని రక్షించవచ్చని వారు చెబుతున్నారు. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రణలోకి తేవడానికి ఈ పద్ధతి అడ్డుకట్ట వేస్తుందని శాస్త్రవేత్తల కంప్యూటర్ నమూనాలు సూచిస్తున్నాయి.
సూర్యుడిని మసకబార్చే ఈ ప్రక్రియను సాంకేతిక భాషలో స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ (SAI) అని పిలుస్తారు. ఈ పద్ధతిలో సల్ఫర్ ఆధారిత సూక్ష్మకణాలతో కూడిన భారీ మేఘాలను వాతావరణంలోని పైపొరల్లోకి (స్ట్రాటోస్ఫియర్) ఆర్టిఫిషియల్‌గా పంపుతారు. ఈ ఏరోసోల్ కణాలు వాతావరణంలో పైనే సంవత్సరాల తరబడి తిరుగుతూ, భూమి వైపు వచ్చే సౌరశక్తిలో కొంత భాగాన్ని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం (రిఫ్లెక్ట్) చెందిస్తాయి. తద్వారా భూమిపై పడే ఎండ తీవ్రత తగ్గి, గ్లోబల్ ఉష్ణోగ్రతలు ఒక సురక్షితమైన స్థాయికి చేరుకుంటాయి.
భూగోళాన్ని చల్లబరిచేందుకు ఈ ‘జియోఇంజినీరింగ్’ సాంకేతికత అద్భుతంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా మరియు వివాదాస్పదమైనదిగా మారింది. ఈ పద్ధతి వల్ల భవిష్యత్తులో గ్లోబల్ వాతావరణ వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుందో, ఎలాంటి వినాశకర పరిణామాలు ఎదురవుతాయో స్వయంగా ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకే పూర్తి స్పష్టత లేదు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఫోబ్ హెచ్చరిస్తూ.. “ప్రకృతి నియమాలకు విరుద్ధంగా చేసే ఈ ప్రయోగం వల్ల పర్యావరణంపై పడే దుష్ప్రభావాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ” అని స్పష్టం చేశారు.
 ఒకవేళ ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులను నిర్లక్ష్యం చేసి, ప్రస్తుత ధోరణిలోనే కాలుష్య ఉద్గారాలను పెంచుకుంటూ పోతే ఫలితాలు ఊహకందని విధంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని 97 శాతం సముద్ర భాగాలు మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోతాయి. ఈ సముద్ర ఉష్ణ తరంగాలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతూ సముద్ర జీవజాలాన్ని అంతం చేస్తాయి. అయితే, భూ ఉష్ణోగ్రత పెంపును పారిశ్రామిక పూర్వ సగటు కంటే 1.5 ∘ C వద్ద నియంత్రించడానికి ఈ SAI సాంకేతికతను వాడితే, కనీసం నాలుగో వంతు సముద్ర భాగాన్ని రక్షించుకోవచ్చు.
పరిశోధకుల లెక్కల ప్రకారం.. మరింత దూకుడుగా వ్యవహరించి వాతావరణ మార్పుల తీవ్రతను 1 ∘C వద్దే కట్టడి చేయగలిగితే, ప్రపంచవ్యాప్తంగా 76 శాతం సముద్ర ప్రాంతాలలో ఉష్ణ తరంగాల తీవ్రత తగ్గుతుంది. అలాగే 80 శాతం ప్రాంతాలలో ఈ ఉష్ణ తరంగాల కాలవ్యవధి ముగిసి వాతావరణం చల్లబడుతుంది. ఈ కృత్రిమ చల్లదనం వల్ల భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న ఉష్ణమండల అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలు అత్యధికంగా లబ్ధి పొందుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో అనేది సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడేళ్లకు ఒకసారి సంభవించే ఒక సహజ వాతావరణ చక్రం. కానీ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న భారీ సముద్ర ఉష్ణ తరంగం దీని తీవ్రతను అసాధారణ స్థాయికి తీసుకెళ్తోంది. దాదాపు 14,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఉష్ణ తరంగం పసిఫిక్ అంతటా వేడిని పెంచుతోంది. దీనికి తోడు, పాపువా న్యూగినియా నుండి కాలిఫోర్నియా తీరం వరకు మరో భారీ ఉష్ణ తరంగం కూడా తోడై వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
 యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన పరిశోధకులు డాక్టర్ మరియానా బెర్నార్డి బిఫ్, డాక్టర్ ఫ్రాంజ్ ఫిలిప్ టుచెన్ తమ అధ్యయనంలో.. ఉత్తర పసిఫిక్ సముద్రపు నీరు వేడెక్కడం వల్ల గాలుల వేగం తగ్గి భూమధ్యరేఖ ప్రాంతం ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. ఈ క్రతువు ఎల్‌నినో తీవ్రతను మునుపెన్నడూ లేనంతగా పెంచి మానవాళిపై, వన్యప్రాణులపై ఘోరమైన ప్రభావం చూపుతుంది. సూర్యుడిని మసకబార్చడం తాత్కాలికంగా సహాయపడినప్పటికీ, ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను శాశ్వతంగా తగ్గించడమే దీనికి అసలైన, సురక్షితమైన మార్గమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.