Crime News : పెద్దల సమక్షంలో బంధుమిత్రుల మధ్య మూడుముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన భార్యను కూడా భర్త అనుమానించే పరిస్థితులు గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు కలిపిస్తు న్నాయి. కుటుంబాన్ని పోషించడం కోసం భర్త తీరిక లేకుండా పనిచేస్తుంటే, తమను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కారణంతో భార్యలు అడ్డదారులు తొక్కడమే కాకుండా ఏకంగా భర్తలను అంత మొందిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. భర్తను అంతమొందించేందుకు భార్య పన్నిన పన్నాగం తెలిసి విస్తుపోవడం భర్త వంతయింది.

Also Read : HIV రిస్క్ ఎంతుందో తెలిపే క్యూఆర్ కోడ్… ఎలా తెలుస్తుందంటే?

వివరాల్లోకి వెళ్తే ..మహమూబాబాద్‌ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. దానికోసం ఆయన కుటుంబంతో కలిసి ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని సాయిప్రభాత్‌నగర్‌లో రెంట్‌కు ఉంటున్నాడు. ఆయనకు2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానీతో వివాహమైంది. వారి ఆనందకర బంధానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్లు. రాజేశ్వరరావు గత నెల 27న మధ్యాహ్న సమయంలో లంచ్‌ చేసేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించాడు.

ఈ విషయమై నిలదీసిన ఆయన ఆ రత్వాతరోజు చిలుకోడులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించేందుకు నిర్ణయించాడు. ఆమె ప్రవర్తన బాలేదని పంచాయతీలో చెప్పుకునేందుకు తన అన్న గాదే శ్రీనివాస్‌ను తీసుకురావడానికి చిలుకోడు పక్కనే సంకేస (తాళ్లసంకేస) గ్రామానికి వెళ్తుండగా తన భార్యతో గడిపిన వ్యక్తి తనను అనుసరించడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఆ తర్వాత చిలుకోడు చేరుకున్న రాజేశ్వరరావు భార్య భవాని సెల్‌ఫోన్‌ను చెక్‌ చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడ్డాయి. భర్తను అడ్డు తొలగించేందుకు ఆమె ప్రియుడైన పురిమెట్ల సైదులుకు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించాడు.

భర్తను ఇంట్లో చంపొద్దని, బయట ఎవరితో అయినా యాక్సిడెంట్ చేయించి చంపించాలని, లేదంటే నేను చచ్చిపోతానని ఆమె పంపిన మెస్సేజ్‌లు బయటపడ్డాయి. దీంతో కంగు తిన్న రాజేశ్వరరావు తన భార్య ప్రియుడికి పంపిన చాటింగ్‌ వివరాలను పోలీసులకు అందజేశాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను హత్య చేసేందుకు కుట్రపన్నిన భార్య, ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులుపై చర్య తీసుకోవాలని రాజేశ్వరరావు ఈ నెల 1న డోర్నకల్లు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్లు పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐ చంద్రమౌళి వివరించారు. అనంతరం కేసును ఖమ్మం గ్రామీణ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, విషయం తెలిసిన పలువురు అదృష్టం బాగుండి బతికిపోయాడు కానీ, లేకుంటే భర్తను చంపిన మరో భార్య అని మీడియాలో చూడాల్సి వచ్చేదని వాపోతున్నారు.

Also Read : మా నాన్న చంపేస్తాడు.. ఎమ్మెల్యే కొడుకు సంచలన ఆరోపణలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.