Kaleshwaram project : తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ “తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నీరు మన భూములకు అందడం లేదు. స్వరాష్ట్రం సిద్ధించే వరకు గోదావరి జలాలు మనకు దక్కవు” అని పదే పదే స్పష్టం చేశారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన గోదావరి జలాల వినియోగంపై దృష్టి సారించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కన్నెపల్లి సమీపంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. 2016లో శంకుస్థాపన జరుపుకోగా, 2019 జూన్ 21న కేసీఆర్ దీనిని జాతికి అంకితం చేశారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దీని ప్రధాన భాగాలు పూర్తయ్యాయి.
భూసేకరణ: ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80,000 ఎకరాల భూమిని సేకరించారు.

నీటి రవాణా మార్గం: మొత్తం 1,832 కిలోమీటర్ల మేర నీటి సరఫరా మార్గాన్ని రూపొందించగా, ఇందులో 1,531 కి.మీ. గ్రావిటీ కెనాళ్లు, 203 కి.మీ. సొరంగ మార్గాలు (టన్నెల్స్) ఉన్నాయి.

నిర్మాణ వ్యవస్థ: నీటిని విడతలవారీగా ఎత్తిపోసేందుకు 20 లిఫ్టులు, 19 పంప్‌హౌస్‌లు, 19 రిజర్వాయర్లను అభివృద్ధి చేశారు.

2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం చుట్టూ తీవ్ర రాజకీయ, సాంకేతిక వివాదాలు చెలరేగాయి. 2023 అక్టోబర్‌లో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోని 7వ బ్లాక్‌కు చెందిన కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, లీకేజీలు రావడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థిరత్వంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) దర్యాప్తు ప్రారంభించింది. దీనికితోడు ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (PC Ghosh) నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్, విజిలెన్స్ విచారణను ఆదేశించింది. కమిషన్ ఇప్పటికే హరీష్ రావు, ఈటల రాజేందర్,మాజీ సీఎం కేసీఆర్‌లను విచారించింది.

కాళేశ్వరం విచారణ & నివేదికల వ్యవస్థ                       |

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA)  – బ్యారేజీల భద్రత, సాంకేతిక లోపాలపై విచారణ
జస్టిస్ PC ఘోష్ జ్యుడీషియల్ కమిషన్ – నిధుల వినియోగం, నిర్ణయాల్లో లోపాలపై విచారణ
విజిలెన్స్ విచారణ- నిర్మాణ నాణ్యత, అక్రమాలపై పరిశీలన         |

గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ లోపాలు, అనాలోచిత మార్పులు, అవినీతి వల్ల రూ. లక్ష కోట్లను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గోదావరి ప్రవాహాన్ని తట్టుకోలేని రీతిలో నిర్మాణం ఉందని, తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డకు మార్చడం వల్ల వ్యయం విపరీతంగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.ప్రాజెక్టులో ఏవైనా అక్రమాలు ఆధారాలతో సహా నిరూపితమైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, IPC 409 కింద కేసులు నమోదై 7 నుండి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటారు. అయితే, ఇప్పటివరకు నేరుగా అవినీతి జరిగినట్లు పక్కా ఆధారాలు ఏవీ బయటపడలేదని బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు చేపడుతోందని ఆ పార్టీ మండిపడుతోంది.

ఈ క్రమంలోనేసాగునీటి రాజకీయంలో భాగమైన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ సందర్శన అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వివాదస్పదమైంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఈ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. గోదావరిలో పుష్కలంగా నీటి ప్రవాహం (సుమారు లక్ష క్యూసెక్కులు) ఉన్నప్పటికీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేయకుండా ప్రభుత్వం నీటిని సముద్రం పాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.రాష్ట్రంలో వర్షపాతం తగ్గి, ఎల్ నీనో ముప్పుతో 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, తక్షణమే ‘బాహుబలి’ పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉన్నప్పటికీ, పంప్‌హౌస్ వద్ద తగినంత నీటి మట్టం ఉన్నందున నీటిని ఎత్తిపోసేందుకు ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేవని, ప్రభుత్వం కేవలం కేసీఆర్‌కు చెడ్డపేరు తేవడానికే నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 నుండి 60,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి బిఆర్ఎస్ బృందం బయలుదేరిన సమయం నుండి కాన్వాయ్‌ను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు.జనగామ జిల్లా పెంబర్తి వద్ద, రఘునాథపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై లారీలు నిలిపి, భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఆరోపణలు, తోపులాట జరిగింది. కార్యకర్తలు బారికేడ్లను తొలగించి కాన్వాయ్‌కు మార్గం సుగమం చేశారు. సాధారణంగా 4 గంటలు పట్టే ప్రయాణం ఆంక్షల వల్ల 7 గంటలు పట్టింది.

సాంకేతిక లొసుగులు: డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిబంధనల ప్రకారం, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దించకుండా నీటిని నిల్వ చేయడం కుదరదని, బ్యారేజ్ స్థిరత్వం దెబ్బతిన్న స్థితిలో నీటిని ఎత్తిపోయడం ప్రమాదకరమైన  చర్య అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలు కూలిపోయే స్థాయికి చేరడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వ డిజైన్ లోపాలే కారణమని, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ బిఆర్ఎస్ రాజకీయ నాటకాలాడుతోందని ప్రభుత్వం తిప్పికొట్టింది.

బీఆర్ఎస్ నేతల విమర్శలకు సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర భారతంలో కాళేశ్వరం దెబ్బతినడం అతిపెద్ద “మానవ నిర్మిత విపత్తు” అని అభివర్ణించారు.పుణేలోని CWPRS, MS Afry, IIT బాంబే వంటి జాతీయ సంస్థల నిపుణులు బ్యారేజీల పునాదుల్లో సీపేజ్, పైపింగ్ సమస్యలపై జియోటెక్నికల్ సర్వేలు చేస్తున్నారు. NDSA పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, 2027 మధ్యనాటికి పూర్తిస్థాయి శాస్త్రీయ పునరావాస పనులు పూర్తవుతాయని ప్రభుత్వం తెలిపింది.బ్యారేజీల పునాదుల కింద నిర్మాణాత్మక స్థిరత్వం (Structural Stability) లోపించినందున, నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయి దిగువన ఉన్న 44 గ్రామాలు, భద్రాచలం పట్టణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భద్రతా కోణాన్ని ముందుకు తెస్తోంది.

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వంపై రైతుల తరఫున ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజీల భద్రతను ప్రామాణికంగా చూపిస్తూ ఆ వాదనను తిరస్కరించడంతో ఈ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ సందర్భంగా కాళేశ్వరం తెలంగాణ రైతులకు జీవనాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, తమకు ఒక్క వారం రోజులు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రమంతటికీ నీళ్లు పారించి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించవచ్చని తెలిపారు. తనకు కేవలం మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు ఇస్తే నీటిని తరలించి చూపిస్తానని, లేకపోతే శాశ్వతంగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

మేడిగడ్డలోని 85 పిల్లర్లలో కేవలం ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయిందని, దాన్ని బూచిగా చూపి ప్రాజెక్టు మొత్తాన్ని నిలిపివేయడం సరికాదని హరీష్ రావు అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను ఏజెన్సీ సొంత ఖర్చుతో 45 రోజుల్లోనే బాగు చేసిందని, అసెంబ్లీలో కాళేశ్వరంపై పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం గనుక తుమ్మిడిహట్టికి అనుమతులు తెచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ చేశారు.

ఈ రగడలో బీజేపీ కూడా ప్రవేశించి, కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ కలిసి ప్రజ దృష్టిని మరల్చడానికి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వ అక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ నిమ్మకు నీరెత్తిన వైఖరి రెండూ రైతాంగానికి నష్టం చేస్తున్నాయని ధ్వజమెత్తింది.రాజకీయాలు పక్కనబెట్టి రైతులకు నీరందించేందుకు నిపుణులు కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు:

కోఫర్ డ్యామ్‌ల నిర్మాణం: దెబ్బతిన్న 7వ బ్లాక్ చుట్టూ తాత్కాలిక కోఫర్ డ్యామ్‌లు నిర్మించి, సురక్షిత బ్లాకుల ద్వారా నీటిని నిల్వ చేసి పంపులను నడపడం.

ఎగువ ప్రాజెక్టుల వినియోగం: ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటిని వరద కాలువల ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరులకు మళ్లించి చివరి ఆయకట్టును కాపాడడం.

గతంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట పునాదులు దెబ్బతిన్నప్పుడు, అప్పటి పాలకులు ‘మిత్రా కమిటీ’ సూచనలతో తాత్కాలికంగా సిమెంట్ గ్రాటింగ్, కోఫర్ డ్యామ్‌లు చేపట్టి సాగునీరు అందించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా కాళేశ్వరం వద్ద తాత్కాలిక ఇంజనీరింగ్ పరిష్కారాలు అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు.

బ్యారేజీలలో నీటి నిల్వ లేకపోవడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ పరిధిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు బంద్ అయి రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.గోదావరిలో లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహించి సముద్రంలో కలుస్తుండగా, బ్యారేజ్ గేట్లు ఎత్తి ఉంచడం వల్ల ఒక్క చుక్క నీటిని కూడా నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది రాష్ట్ర సాగునీటి భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇరిగేషన్ నిర్మాణం మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. నిరూపించాల్సిన ఆరోపణలు ఒకవైపు, కాపాడాల్సిన రైతు ప్రయోజనాలు మరోవైపు ఉన్న తరుణంలో.. రాజకీయ పంతాలు పక్కనపెట్టి సాంకేతిక పరిష్కారాల ద్వారా రైతులకు నీరందించడమే తక్షణ కర్తవ్యం.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.