MLC Mirza Rahmat Baig : బహిష్కరణకు గురైన ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడని తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీ బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే తను ఉమ్రా యాత్రలో ఉన్నానని, పార్టీ అధిష్టానం తన బహిష్కరణ విషయంలో పునరాలోచించాలని కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే పార్టీ ఆదేశాలను పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్​ ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా ప్రకటించడం సంచలనంగా మారింది.

అంతటితో ఆగకుండా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెంటనే శాసన మండలి ఛైర్మన్‌ కు సమర్పించాలని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అత్తాపూర్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో మీర్జా రహమత్ బేగ్‌ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మారువేషంలో ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. ఇదే అంశంపై ఏఐఎంఐఎం జాయింట్ సెక్రటరీ అయిన హుస్సేన్ అన్వర్ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. మీర్జా రహమత్ బేగ్‌ ను ఏఐఎంఐఎం నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది.. ఆయన వెంటనే శాసన మండలి ఛైర్మన్‌ కు తన రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది.. అని పేర్కొన్నారు.

అయితే రహ్మత్‌ బేగ్‌ మాత్రం రాజీనామాకు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.అయితే ఆయన రాజీనామా చేయకపోవడంతో సీరియస్ అయిన పార్టీ సభ్వత్వం కూడా రద్దు చేసింది. ఇదిలా ఉండగా రహ్మత్‌ బేగ్‌ బహిష్కరణ అంశం రాజకీయంగా పెనుసంచలంగా మారింది. ఈ వ్యవహారంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మజ్లిస్‌ నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ ను ఎందుకు బహిష్కరించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్ధరాత్రి పూట ఆయనను సస్పెండ్‌ చేయడం వెనుక మర్మమేంటని రాజాసింగ్‌ ప్రశ్నించారు.. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా ఓ బాంబ్‌ పేల్చారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో బేగ్ ప్రమేయం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు మౌనం వహించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగ్‌ ఎమ్మెల్సీగా గెలవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సాయపడ్డాయని ఆయన అన్నారు. ఈ అంశంపై ఆయా పార్టీలు ఇప్పుడు బహిరంగంగా స్పందించాలని రామచందర్‌ రావు డిమాండ్ చేశారు.

కాగా రహ్మత్‌ బేగ్‌పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దురుసు ప్రవర్తనతో వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మొదట మజ్లిస్‌ మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ వద్ద డ్రైవర్‌గా చేరారు. అనంతరం పార్టీ కార్యకర్తగా మారి, నాయకుడిగా ఎదిగారు. అయితే ఈ క్రమంలో ఇతర పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించేవారన్న ఆరోపణలున్నాయి. ప్రతి వివాదాల్లో తలదూర్చడం, పాతబస్తీ సహా నగరంలో ఎక్కడ గొడవ జరిగినా.. క్షణాల్లో తన అనుచరగణంతో చేరుకుని హల్‌చల్‌ సృష్టించడం ఆయనకు అలవాటన్న ఆరోపణలున్నాయి. కాగా, పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత రహ్మత్‌ బేగ్‌ ఒక వీడియో విడుదల చేశారు. తను కుటుంబ సభ్యులతో కలిసి 26న ఉమ్రాకు వచ్చినట్లు తెలిపారు. తన పరువుకు నష్టం కలిగించేలా అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారని ఆరోపించారు. ఈ విషయపై గోల్కొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాద చేసినట్లు తెలిపారు. అలాగే మజ్లిస్‌ పార్టీ కార్యకర్తగా కొనసాగాలని భావిస్తున్నానన్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ న్యాయం చేస్తారని ఆశిస్తు్న్నానని రహ్మత్‌ బేగ్‌ వీడియో విడుదల చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.