
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య అప్పుల పంచాయితీ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర అప్పులపై చర్చకు రావాలంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌తో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పుల లెక్కలపై ముఖాముఖి చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు బహిరంగ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. “నేను నా సవాల్‌కు కట్టుబడి ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఇక్కడికి చర్చకు రావాలి. ఒకవేళ చర్చలో నాది తప్పు అని తేలితే నా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం. ధైర్యం ఉంటే వాళ్లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి.. లేదంటే బీఆర్ఎస్ అనేది సిగ్గు తప్పిన పార్టీ అని ఒప్పుకోవాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పారిపోవడం మా ఇంటావంటా లేదు
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ… నేను కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు 4 పేజీల లేఖ రాశా.. రూ.4.17 లక్షల కోట్ల ప్పు అంటూ హరీష్ నాకు రిటర్న్ లెటర్ పంపారు.. రూ.8.21 లక్షల కోట్ల అప్పులని నేను లేఖలో చెప్పా.. సొల్లు కథలతో హరీష్ నాకు తిరిగి లేఖ పంపారు.. నేను ఎప్పుడెప్పుడు ఎంత అప్పు చేశారో లేఖలో పేర్కొన్నా.. ఆ విషయంపై హరీష్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో అప్పు చేయలేదా..? కాళేశ్వరం పేరుతో రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తారా అని అడిగా..? మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు ఎవరు కట్టాలి..?? బీఆర్ఎస్ అప్పులపై 2.8 లక్షల కోట్ల వడ్డీ కట్టామని చెప్పుకొచ్చారు.
హరీష్ రావు బహిరంగ లేఖ
మరోవైపు మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. అప్పుల విషయంలో తమ లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులన్నీ కలిపినా మొత్తం రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని నేను గతంలో అసెంబ్లీ సాక్షిగా కూడా స్పష్టంగా చెప్పాననని హరీష్ రావు గుర్తుచేశారు.
మేము కేవలం రూ.3.47 లక్షల కోట్ల అప్పు మాత్రమే తెచ్చామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అసెంబ్లీలో ఒప్పుకున్న విషయాన్ని మర్చిపోవద్దని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఏకంగా రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అప్పుల విషయంలో తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పుల అంశంపై తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.









