
BRS : మాజీ సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలు దేశంలో ఎవరూ చేయలేదన్నారు బీఆర్ఎస్ వర్కి్ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేవుడి దయ ఉండాలన్నా.. మనుషుల శ్రమ కూడా తోడవ్వాలని చెప్పారు. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలను మాత్రం గాలికి వదిలేయొద్దు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో చిట్‌చాట్ లో ఆయన పలు సంచలన విషయాలను పంచుకున్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో సుమారు 10 వేల ఎకరాల విలువైన భూములను దారాదత్తం చేస్తూ పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని, దాదాపు కోటి 20 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా సెప్టెంబర్ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, పారిశ్రామికవేత్తలకు లేఖలు కూడా రాస్తామని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో తమ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ హిల్ట్ పాలసీని పూర్తిగా రద్దు చేస్తామని, ఈ పాలసీ నమ్మి డబ్బులు చెల్లిస్తే పారిశ్రామికవేత్తలే నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read : రెంట్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త మోసం.. సజ్జనార్ హెచ్చరిక!
కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుణ యాగాలపై స్పందిస్తూ.. హరీష్ రావు గుడికి వెళ్తే కాంగ్రెస్ నాయకులు క్షుద్ర పూజలంటూ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతుల కష్టాలపై ఎలాంటి పట్టింపు లేదని, ఆయన దృష్టిలో భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమేనని విమర్శించారు. తాము పాలమూరు వస్తున్నామని చెప్పగానే భయపడి పంపులు ఆన్ చేశారని, మేం ముళ్ల కర్రతో పొడిచే వరకు ఈ సీఎంకు రైతుల సమస్యలు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని, మరోవైపు హైడ్రా పేరుతో నిరుపేదల కడుపు కొడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో పొంగులేటిని 30 శాతం కమీషన్ మంత్రిగా అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ నీటిని తరలించుకుపోతున్నా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : KCR సంచలన నిర్ణయం..పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం!









