
Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు కీలక తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని పిటిషనర్లు వాదించారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలు ఆయన పార్టీ మారినట్లు స్పష్టం చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుకు పాల్పడినట్లు చట్టపరంగా నిర్ధారించే ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు పూర్తిగా విన్నది. అనంతరం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. ఇప్పుడు రేపు వెలువడనున్న తీర్పుపైనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దానం నాగేందర్ అనర్హతపై పిటిషనర్ల వాదనలను హైకోర్టు అంగీకరిస్తుందా? లేక స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్నే సమర్థిస్తుందా? అన్నది రేపు తేలనుంది.
ఈ తీర్పు దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తుతో పాటు తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వివాదంపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.









