
Telangana : తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ వేదికగా దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా ముందుకు వచ్చి కొండా సురేఖ తీరుపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ఆయన నిర్ణయాలను సొంత పార్టీలోనే ఉంటూ విమర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ వివరణ ఇవ్వడంపై ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. తల్లి ఫొటో వెనుక ఉండి కూతురు మాట్లాడితే, ఆ వ్యాఖ్యలతో తల్లికి సంబంధం ఎలా ఉండదని ప్రశ్నించారు.
పార్టీ అధికారంలోకి రావడానికి వేలాది మంది కార్యకర్తలు కష్టపడ్డారని, పదవులను అనుభవిస్తూ పార్టీ అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మానుకోవాలని కొండా కుటుంబాన్ని హెచ్చరించారు. సీఎంపై, పార్టీ నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేసేవారికి కాంగ్రెస్‌లో ఉండే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. వెంటనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిసిప్లినరీ కమిటీకి, హైకమాండ్‌కు ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ వివాదం ముదిరిపాకాన పడటంతో త్వరలోనే పార్టీ అధిష్టానం ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపై పార్టీ వేటు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రివర్గం నుంచి ఆమెను తొలగిస్తే, సామాజిక సమీకరణాల దృష్ట్యా మరో బీసీ మహిళా నేతకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ అధిష్టానం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేయడమే ఆమె నైజమని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిన చరిత్ర ఆమెదని ఆరోపించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అధిష్ఠానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించక ముందే ఆమెంతట ఆమె పార్టీ నుంచి వెళ్లిపోవడం మంచిదని హితవు పలికారు. అంతేకాకుండా, సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఆమెకు సక్రమమైన సంబంధాలు లేవని, ఒక్క ఎమ్మెల్యేతోనైనా ఆమె సఖ్యతగా ఉన్నారా అని నాయిని రాజేందర్ రెడ్డి నిలదీశారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి సురేఖ అనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం ఎద్దేవా చేశారు. కూతురు అలా మాట్లాడుతుంటే తల్లికి సంబంధం ఎలా ఉండదని ప్రశ్నించారు. గతంలో నటీమణుల విషయంలోనూ కొండా సురేఖ ఇలాగే మాట్లాడి వివాదాలు సృష్టించారని గుర్తుచేశారు. కొండా సురేఖ ఉపయోగించే తప్పుడు భాష, చేసే వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, సీఎంను బలహీనపరిచేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొండా సురేఖ తీరు కేవలం ఎంటర్టైన్మెంట్లా ఉందని, ఆమె వైఖరిపై పార్టీ అధిష్టానం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించేవారిపై, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరేశం స్పష్టం చేశారు.









