
Addanki Dayakar : కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్‌కు అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యావకాశం లభించింది. ప్రముఖ అధ్యాపకుడు ప్రొఫెసర్ మార్షల్ గ్యాంజ్ (Prof. Marshall Ganz) నేతృత్వంలో హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లోని ‘ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ విభాగం, ‘ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ నేరేటివ్’ ఆధ్వర్యంలో నిర్వహించే ‘లీడర్షిప్, స్టోరీటెల్లింగ్ అండ్ యాక్షన్’ అంశాలపై ఆగస్ట్ 31 నుండి డిసెంబర్ 18, 2026 వరకు ఆయన ఈ కోర్సులో అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఆగస్ట్ 31వ తేదీ నుండి జరిగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నాయకులు విభిన్న రంగాల్లో నాయకత్వ సవాళ్లను విశ్లేషిస్తారు.
ఈ ఆధ్యయనంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి, వివిధ దృక్పథాలతో వచ్చేవారితో నాయకత్వ సవాళ్లపై చర్చిస్తారు. పబ్లిక్ పాలసీ గురించి నాయకులు ఎదుర్కొనే సమస్యలపై భిన్న కోణాల నుండి విశాల దృక్పథంతో చర్చించడం. బలమైన నాయకత్వం కావాలంటే తీసుకోవాల్సిన చర్యలపై తరగతి గదిలో విశ్లేషించడం తదితర కీలక అంశాలపై ఆయన ఇక్కడ విశేషమైన అధ్యయనం చేయనున్నారు.
ఇక డాక్టర్ అద్దంకి దయాకర్ విద్యా నేపథ్యం గురించి వస్తే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కామర్స్ విభాగంలో డాక్టరేట్ (Ph.D.) పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA), మాస్టర్స్ ఇన్ కామర్స్ (M.Com), బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) పూర్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీ-జేఏసీ (T-JAC) లో క్రియాశీలకంగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడిగా సేవలందించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా (MLC) ఎన్నికై, తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా (మంత్రి హోదాలో) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సూర్యాపేట జిల్లా నిమ్మికల్ గ్రామానికి చెందిన అద్ధంకి దయాకర్ ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చారు. అలాంటి డాక్టర్ అద్దంకి దయాకర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ అవకాశం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









