
Women’s Reservation Bill : అనేక ఏళ్లుగా అమలుకు నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్ధేశించిన ఈ బిల్లును 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంటులో ఆమోదం పొందేలా చేయడానికి కేంద్రం మరోసారి ప్రయత్నం మొదలు పెట్టింది. అదే సమయంలో దేశంలో ఉన్న 543 లోక్ సభ నియోజకవర్గాలను 816 స్థానాలకు పెంచే ప్రతిపాదనను కూడా మరోసారి పార్లమెంట్ ముందుకు తేనుంది.
దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన విపక్షం కాంగ్రెస్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది. గత కొంతకాలంగా నీట్ లీక్, విద్యార్థులపై దాడి, కేసులు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి సమాధానాలు చెప్పాలని విపక్షాలు పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సుమారు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్లులు ఆమోదం పొందడానికి సహకరించాలని రిజిజు వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
Also Read : UPI యూజర్లకు బిగ్ షాక్…. ట్రాన్సెక్షన్స్‌పై ఛార్జీలు.!
ఢిల్లీలో నీట్ లీక్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఉద్యమించిన విద్యార్థులపై హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాపార్లమెంటులో ప్రకటన చేయాలని, అలాగే అయోధ్యలో విరాళాల చోరీపై చర్చ జరగాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయనతో స్పష్టంచేశారు. ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిందేనని వారు పట్టుపట్టారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధాన ప్రతిపక్షం నుంచి రిజిజుకు ఎలాంటి హామీ లభించకపోవడంతో ఆయన వెను తిరగాల్సి వచ్చింది. కాగా పునర్విభజన అంశంపై రాహుల్‌తో రిజిజు భేటీ కావడం గత పదిరోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఇక నియోజక వర్గాల పెంపు విషయమై పార్లమెంటులో కీలక పార్టీలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే నేతలతోనూ ప్రభుత్వం చర్చించాలని భావిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మంది మద్దతు అవసరం ఉండటంతో వారితో చర్చలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతమున్న సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో 50% వరకు సీట్లు పెంచేలా కొత్త ప్రతిపాదనను బిల్లులో చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. గత ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులు ఆమోదానికి 2/3వ వంతు బలం సమీకరించుకోవడం కేంద్రానికి సాధ్యం కాలేదు. అయితే ఆ తర్వాత జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో అధికార కూటమి బలం గతం కంటే పెరిగింది. దీంతో ఈసారి బిల్లును ఎలాగైనా ఆమోదించుకుని తీరాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగుస్తాయి. ఈ బిల్లుల కోసం మరోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాల్సి ఉంది.
Also Read : మాట నిలబెట్టుకున్న విజయ్.. పెళ్లి అయితే పట్టుచీర, పుడితే బంగారం!









