
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ స్థలం కోసం జరిగిన చిన్న వివాదం ఒకరి ప్రాణం తీయగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. బిందాపుర్ ప్రాంతంలో బైక్ పార్కింగ్ విషయమై పొరుగువారితో జరిగిన గొడవలో 32 ఏళ్ల మహిళ కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 2:50 గంటల సమయంలో బిందాపుర్ పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇద్దరు ముగ్గురు యువకులు తన కూతురు, అల్లుడిని కడుపులో కత్తులతో పొడిచారని బాధితురాలి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే స్థానికులు గాయపడిన దంపతులను చికిత్స కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆర్తి (32) మరణించినట్లు ప్రకటించారు. ఆమె భర్త విక్కీ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై బైకు పార్క్ చేసే విషయంలో ఆర్తి, విక్కీ దంపతులకు వారి పొరుగువారితో చిన్న మాటల యుద్ధం నడిచింది. ఆ గొడవ కాస్తా పెద్దదై పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పొరుగువారు కత్తితో ఆ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడికి పాల్పడిన వారిని అదే ప్రాంతంలో నివసిస్తున్న పప్పు (40), ఒక మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడైన పప్పును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మైనర్ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.









