
Ayodhya Ram Temple : అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగం కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందికి కోర్టులో నేరం నిరూపితమైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ఆధారంగా అయోధ్య పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కొత్త చట్టం BNS లోని అత్యంత కఠినమైన సెక్షన్లను FIR లో చేర్చడమే దీనికి కారణం. ఈ కేసులో కుట్ర, నమ్మకద్రోహం, దొంగిలించబడిన సొత్తును దాచడం వంటి ఆరోపణలపై ఎనిమిది మంది పేరున్న నిందితులతో పాటు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులపై BNS సెక్షన్లు 61, 306, 316, 317 కింద కేసులు బుక్ చేశారు.
1. క్రిమినల్ కాన్స్పిరసీ (సెక్షన్ 61):
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక అక్రమమైన పని చేయడానికి లేదా లీగల్ పద్ధతిని ఇల్లీగల్‌గా చేయడానికి ప్లాన్ వేస్తే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ వర్తిస్తుంది. చట్టం ప్రకారం.. మరణశిక్ష, జీవిత ఖైదు లేదా రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడే పెద్ద నేరాలకు కుట్ర పన్నినప్పుడు, ఆ కుట్రదారులకు కూడా ప్రధాన నేరం చేసిన వారితో సమానంగా శిక్ష విధిస్తారు.
2. దొంగతనం (సెక్షన్ 306):
ఒక ఆఫీసులో పనిచేసే క్లర్క్ లేదా సేవకుడు తన యజమాని ఆధీనంలో ఉన్న ఆస్తిని దొంగిలిస్తే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఇందులో నేరం నిరూపితమైతే తప్పనిసరి ఫైన్‌తో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
3. నమ్మకద్రోహం (సెక్షన్ 316 – 5):
ఈ కేసులో అత్యంత సీరియస్ చార్జ్ ఇదే. ఒక పబ్లిక్ సర్వెంట్ గానీ, బ్యాంకర్, వ్యాపారి లేదా ఒక ఏజెంట్‌గా ఉంటూ.. తన నమ్మకం మీద అప్పగించిన ఆస్తిని లేదా సొమ్మును మోసపూరితంగా తన సొంతానికి వాడుకుంటేఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ కింద నేరస్థులకు 10 ఏళ్ల నుంచి గరిష్టంగా జీవిత ఖైదు మరియు జరిమానా విధించే అవకాశం ఉంది.
4. దొంగిలించిన సొత్తును దాచడం (సెక్షన్ 317):
దొంగిలించబడిన సొత్తును అలవాటుగా తీసుకోవడం, దాచడం, కొనడం లేదా దాంతో వ్యాపారం చేయడం వంటివి చేస్తే సెక్షన్ 317(4) కింద 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. అలాగే ఆ దొంగసొత్తును దాచడానికి ఇష్టపూర్వకంగా సహాయం చేసిన వారికి సెక్షన్ 317(5) కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధిస్తారు.
రామమందిరం విరాళాల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు రావడంతో యూపీ ప్రభుత్వం వేసిన సిట్ విచారణలో ప్రాథమిక నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల ఫైనాన్షియల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు మరియు సాక్షుల స్టేట్‌మెంట్లను పరిశీలించి, ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.









