
ఆడపిల్లల ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని తీసుకొచ్చింది. ఆడపిల్లల భవిష్యత్తును బంగారు మయం చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలో కంటే అత్యధిక వడ్డీ రేటును అందిస్తుండటంతో ఈ పథకం ఎంతో మందిని ఆకర్షిస్తోంది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి ఆమె చదువు, పెళ్లి సమయానికి తగినంత ఆర్థిక వెసులుబాటు కల్పించడమే. 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఆమె తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్లు ఈ ఖాతాను బ్యాంకులు లేదా తపాశా కార్యాలయాల్లో సులభంగా ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ కవల పిల్లలు జన్మిస్తే మాత్రం ముగ్గురికి ఈ అవకాశం వర్తిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కాలవ్యవధి మొత్తం 21 సంవత్సరాలు అయినప్పటికీ డిపాజిట్లు మాత్రం మొదటి 15 సంవత్సరాలు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన 6 సంవత్సరాలు ఖాతాలో జమ అయిన మొత్తంపై ప్రభుత్వం వడ్డీని కలుపుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. చక్రవడ్డీ పద్ధతిలో వడ్డీ జమ కావడం వల్ల దీర్ఘకాలంలో భారీ మొత్తంలో కార్పస్ ఫండ్ సమకూరుతుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలను వరుసగా 15 ఏళ్ల పాటు ప్రతి ఏటా క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి అనగా 21 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఏకంగా రూ. 71 లక్షల వరకు భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంది. ఇందులో తల్లిదండ్రులు జమ చేసే అసలు మొత్తం రూ. 22.5 లక్షలు కాగా.. ప్రభుత్వ వడ్డీ రూపంలోనే సుమారు రూ. 48.5 లక్షల వరకు లభిస్తుంది. ఈ రకమైన రాబడి ఇతర సురక్షిత డిపాజిట్లలో లభించడం చాలా అరుదు.
అంతేకాకుండా ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డిపాజిట్ చేసే మొత్తం, ప్రతీ ఏటా వచ్చే వడ్డీ, అలాగే చివరిగా మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం.. ఇలా మూడంచెల పన్ను మినహాయింపు లభించడం ఈ పథకం స్పెషాలిటీ.
పాపకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత ఆమె ఉన్నత విద్య ఖర్చుల కోసం ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. అలాగే 21 ఏళ్లు నిండిన తర్వాత లేదా 18 ఏళ్ల తర్వాత పెళ్లి జరిగితే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి, సంపూర్ణ ప్రభుత్వ భద్రత కోరుకునే ప్రతి ఒక్కరికీ సుకన్య సమృద్ధి యోజన బాగా ఉపయోగపడుతుంది.









