
Rakhi Timings : అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28వ తేదీన జరుపుకుంటున్నారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం సమయంలోనే ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఇలా రెండు రోజులూ పౌర్ణమి తిథి ఉండటంతో ఏ రోజు శుభకార్యం నిర్వహించాలని చాలా మంది సందేహపడ్డారు.
Also Read : లా స్కూల్ విద్యార్థులకు బిగ్ షాక్.. డిగ్రీ వేడుకలు రద్దు.. కొరియర్ ద్వారానే సర్టిఫికెట్లు.. కారణమదే!
కానీ రాఖీ పౌర్ణమిని ఆగస్టు 28న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుడికి ఆయన చెల్లెలు భద్ర కాలంలోనే రాఖీ కట్టిందని.. ఆ కారణంగానే రావణాసురుడికి తీవ్రమైన అశుభం జరిగి లంక నాశనమైందని ఒక బలమైన నమ్మకం ఉంది. అందుకే భద్ర కాలం ఉన్న సమయంలో పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు. ఆగస్టు 27వ తేదీన పౌర్ణమి ప్రారంభమైనప్పటికీ ఆ రోజంతా పగటి వేళల్లో భద్ర కాలం వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఆ రోజు ఉదయం లేదా మధ్యాహ్నం సమయాల్లో రాఖీ కట్టడం మంచిది కాదు.
హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు 27వ తేదీ సాయంత్రం భద్ర కాలం పూర్తిగా ముగిసిన తర్వాత ప్రదోష కాలంలో రాఖీ కట్టుకోవడానికి మంచి ముహూర్తం ఉంటుంది. కానీ చాలామంది ఉదయకాల తిథినే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఆగస్టు 28వ తేదీ ఉదయం సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఉండటమే కాకుండా ఎలాంటి భద్ర దోషం ఉండదు. కాబట్టి ఆగస్టు 28వ తేదీ ఉదయం పూజ చేసి రాఖీలు కట్టడం అత్యంత శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. అంటే ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల మధ్య రాఖీ కట్టవచ్చని పండితులు తెలిపారు. ఈ సమయంలో కడితే సోదరులకు మంచి జరుగుతుందని అంటున్నారు.
అయితే రాఖీ పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, పూజ పళ్లెంలో రాఖీ, అక్షతలు, కుంకుమ, దీపం, తీపి పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఇష్టదైవానికి లేదా వినాయకుడికి తొలి రాఖీ సమర్పించి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత సోదరుడికి కుంకుమ తిలకం దిద్ది, కుడిచేతి మణికట్టుపై ప్రేమతో రాఖీ కట్టాలి. ఆ తర్వాత తీపి తినిపించి ఆశీస్సులు అందజేస్తే, అన్నదమ్ములు తమ తోబుట్టువులకు రక్షణగా ఉంటామని మాట ఇస్తూ కానుకలు అందజేస్తారు. ఈ విధంగా సరైన ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల సోదరుల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వారి మధ్య అనుబంధం కూడా పెరుగుతుందన్నారు.
Also Read : నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఈశ ఫౌండేషన్ బృందం.. 80 మంది గల్లంతు?









