
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘంపై ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిరసనలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్తారనే ప్రశ్నకు రాహుల్ ఆసక్తికరంగా స్పందించారు. ఇది తాండవం.. శివుడి నృత్యం.. దీనికి ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదు. ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు అని సోమవారం అన్నారు. తాము వీధుల్లో పోరాటం చేయడం లేదని, భారత ప్రజల మనసులు, హృదయాల కోసం పోరాడుతున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ప్రమాదకరమని వారికి తెలియజేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ నిరసనలను ఎలా నిర్వహించాలనే విషయంపై తన సోదరి ప్రియాంక గాంధీతో చర్చ జరిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని వివరించారు.
మనం ఒక ప్లాన్ వేసుకోవాలని నా సోదరి అంటుంది. కానీ ఆమె అసలు విషయం అర్థం చేసుకోవడం లేదు. ఇది తాండవం.. పరమశివుడి నృత్యం. దీనికి ముందస్తు ప్రణాళికలు ఉండవు. ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్తాం.. రేపు మరో కార్యక్రమం చేపడతాం. ఆకాశవాణి భవన్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ముందుగా ఏదైనా పెద్ద ప్లాన్ వేసుకున్నామా? అని రాహుల్ ప్రశ్నించారు.
మొదట బస్సులో వెళ్లి, అక్కడ కూర్చుని అరెస్టు కావాలనుకున్నామని, అయితే పోలీసులు తమను ముందుకు వెళ్లనివ్వకపోవడంతో ప్రణాళిక మార్చుకున్నామని తెలిపారు. అలా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలో రోజంతా నిరసన చేపట్టి, రాత్రి వరకు అక్కడే ఉన్నామని గుర్తుచేశారు. ఈ ఫలితం ముందుగా వేసుకున్న ప్లాన్ వల్ల వచ్చిందా? లేక అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, శివుడి ఊరేగింపులో ఎవరైనా చేరవచ్చని వ్యాఖ్యానించారు.
Also Read : ఇకపై జంతర్ మంతర్‌లో నో పర్మిషన్.. ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం!
గత వారం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు కనిపించడంతో రాహుల్ గాంధీ అప్పటికప్పుడు తన నిరసన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ ప్రాంగణాన్ని నిరసన వేదికగా మార్చి, రోజంతా అక్కడే బైఠాయించారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వైపు ర్యాలీగా వెళ్తున్నారు.
తన భారత్ జోడో యాత్రను కూడా రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ యాత్ర ప్రజలందరినీ ఒక్కటి చేసిందని చెప్పారు. “భారత్ జోడో యాత్రలో ఎవరూ రాజులు కాదు. అందరూ కలిసి నడిచారు. భారత ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అదొక తాండవం.. శివుడి ఊరేగింపు లాంటిది” అని అన్నారు. భారత ప్రజలు తమ హక్కుల కోసం ఎలా పోరాడతారో కూడా రాహుల్ వివరించారు. “భారతదేశం ప్లానింగ్‌తో పోరాటం చేయదు. మనసుతో పోరాడుతుంది. ఈ పోరాటం కొనసాగుతోంది.. ఇకపైనా కొనసాగుతుంది” అని హిందీలో వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలు వేర్వేరుగా నిరసనలు చేస్తున్నాయన్న వాదనను రాహుల్ తోసిపుచ్చారు. అన్ని ఆందోళనలూ ఒకటేనని, వేర్వేరు నిరసనలు ఏమీ లేవని స్పష్టం చేశారు. భారతదేశమే ముందుకు కదులుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎవరు పోరాడినా వారితో కలిసి నడుస్తామని, వారికి మద్దతు ఇస్తామని చెప్పారు. తమకు ఎవరు మద్దతు ఇస్తారో వారి నుంచి కూడా ఇదే సహకారాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. భారత ప్రజలపై తమకున్న ప్రేమకు ఈ నిరసనలు ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి.. ఆ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షాలను కూడా పదవుల నుంచి తప్పించాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని తొలగించాలన్న డిమాండ్‌తో మొదలైన ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
Also Read : మార్కెట్‌లోకి కొత్త సరుకు.. 200MP కెమెరాతో మొబైల్ ఫీచర్లు హైలైట్..!









