
Prashant Kishor : భారత రాజకీయాల్లో నంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో తన తొలి అడుగులోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. బిహార్‌లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప-ఎన్నికలో ఆయన ఘనవిజయం సాధించి, తొలిసారిగా చట్టసభలోకి అడుగుపెడుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి చెక్కుచెదరని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో పీకే సాధించిన విజయం బిహార్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ ఈ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, 2026 ఏప్రిల్‌లో ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వడంతో బంకీపూర్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ ఉప-ఎన్నిక అనివార్యమైంది. రాజీనామా చేసిన నితిన్ నబీన్ తన అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హాను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపగా, ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తరఫున రేఖా కుమారి గుప్తా పోటీ పడ్డారు. అధికార బలం, సుదీర్ఘకాలపు మద్దతు ఉన్నందున విజయం తమదేనని కమలనాథులు భావించినప్పటికీ, పీకే రూపంలో వారికి అనూహ్యమైన భంగపాటు ఎదురైంది.
జులై 30న పోలింగ్ జరగ్గా, ఆగస్టు 3న వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ప్రారంభం నుంచే ప్రశాంత్ కిశోర్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తం 31 రౌండ్ల లెక్కింపులో తొలి రౌండ్లోనే 862 ఓట్ల ఆధిక్యం సాధించిన పీకే, ఐదో రౌండ్ నాటికి 3,451 ఓట్లకు పెంచుకున్నారు. 18వ రౌండ్ పూర్తయ్యేసరికి 10 వేల ఓట్ల మైలురాయిని దాటిన ఆయన, ఆఖరి రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేల కంటే ఎక్కువ ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ ప్రాంతం పట్నా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 1995 నుంచి 2005 వరకు బీజేపీ సీనియర్ నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2006 నుంచి 2025 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన కుమారుడు నితిన్ నబీన్ ఐదుసార్లు విజయం సాధించారు. అంటే గత 30 ఏళ్లుగా ఒక్క పార్టీ ఏకఛత్రాధిపత్యం వహించిన ఈ స్థానాన్ని బద్దలు కొట్టడం ద్వారా పీకే తన రాజకీయ వ్యూహ చతురతను ప్రజాక్షేత్రంలోనూ నిరూపించుకున్నారు.
Also Read : ప్రశాంత్ కిశోర్ దెబ్బ.. Gen Z లక్ష్యంగా బీజేపీలో భారీ మార్పులు.. వారంతా ఔట్?
ప్రశాంత్ కిశోర్ వ్యక్తిగత నేపథ్యం..
బిహార్‌లోని రోహ్తాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ఆయన తండ్రి శ్రీకాంత్ పాండే వైద్యవృత్తి రీత్యా బక్సార్‌కు మారడంతో, పీకే తన మాధ్యమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐక్యరాజ్యసమితి (UN) లో ప్రజారోగ్య నిపుణుడిగా (Public Health Specialist) బాధ్యతలు నిర్వహించారు. సమాజంలో మూలమట్టం నుంచి మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐరాస ఉద్యోగాన్ని వదిలి భారతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు.
2013 మే నెలలో పీకే ‘సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ (CAG) ను స్థాపించి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచార బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. ‘చాయ్ పే చర్చ’, ‘3D ర్యాలీలు’, ‘రన్ ఫర్ యూనిటీ’ వంటి వినూత్న కార్యక్రమాలతో మోదీ విజయానికి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాగ్‌ను ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ (I-PAC) గా మార్చి, 2015లో బిహార్ మహాఘట్బంధన్, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ (ప్రజాసంకల్ప యాత్ర, సమర శంఖారావం వ్యూహాలు), 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, 2021లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకేల ఘనవిజయాల్లో ప్రధాన వ్యూహకర్తగా నిలిచారు.
ఎన్నికల వ్యూహకర్తగా విశేష సేవలు అందించిన అనంతరం ఆయనకు రాజకీయ పదవులు కూడా లభించాయి. 2018 సెప్టెంబర్ 16న జేడీయూలో చేరిన పీకేను ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీ (NRC) అంశాలలో పార్టీ వైఖరిని బహిరంగంగా విమర్శించడంతో నితీశ్‌తో విభేదాలు వచ్చి, 2020 జనవరి 29న ఆయన జేడీయూ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
2021 బెంగాల్ ఎన్నికల అనంతరం వ్యూహకర్త బాధ్యతలకు స్వస్తి చెప్పిన పీకే, బిహార్‌ను మార్చడమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పట్నాలో ‘జన్ సూరజ్ పార్టీ’ని అధికారికంగా ప్రారంభించారు. “జై బిహార్” నినాదంతో ఇతర రాష్ట్రాల్లో బిహారీలకు ఎదురవుతున్న అవమానాలకు స్వస్తి పలకాలనే పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితమైన పీకే, జన్ సూరజ్ అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలో బంకీపూర్ ఉప-ఎన్నికను సవాలుగా తీసుకుని నేరుగా పోటీకి దిగిన పీకే, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో భూగర్భ జలాల క్షీణత, విద్యుత్, రోడ్ల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై దృష్టి సారించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించారు. బీజేపీ కంచుకోటలోనే ఆ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో ఓడించడం ద్వారా జన్ సూరజ్ పార్టీకి బిహార్‌లో బలమైన పునాది వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను గెలిపించిన పీకే, ఇప్పుడు స్వయంగా ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెడుతుండటంతో ఆయన రాజకీయ ప్రస్థానం కొత్త మలుపు తిరిగింది. ఈ విజయం జన్ సూరజ్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాక, రాబోయే రోజుల్లో బిహార్ రాజకీయాల్లో పీకే అత్యంత కీలకమైన శక్తిగా మారబోతున్నారని స్పష్టం చేస్తోంది.
Also Read : ఇకపై జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నిరసనలు బంద్?









