
ఈ ఏడాది రుతుపవనాల రాక కోసం సుదీర్ఘకాలం నిరీక్షించిన ఆర్థిక రాజధాని ముంబైని ఒక్కసారిగా కుండపోత వర్షం ముంచెత్తింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబై నగరంతో పాటు ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మేఘమథనం చెలరేగింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు.. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాలలో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ఈ ఆకస్మిక భారీ వర్షం కారణంగా సోమవారం ఉదయానికల్లా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల రికార్డుల ప్రకారం.. ముంబై ఈస్టర్న్ , వెస్టర్న్ సబ్‌అర్బ్స్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే వాన తీవ్రత ఎక్కువగా ఉంది. ఐలాండ్ సిటీలో గరిష్టంగా మాతుంగాలో 53.4 మిమీ, దాదర్‌లో 45.6 మిమీ మేర మోస్తరు వర్షం కురిసింది.
Also Read : తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. DMKకు దిమ్మతిరిగే షాక్!
#MumbaiRains Update: Slight waterlogging has been reported at Kings Circle in Matunga following the rainfall. Traffic movement remains largely unaffected, though commuters are advised to exercise caution while passing through the area. pic.twitter.com/ZwaFTlYZaP
— Citizen PulseX (@CitizenPulseX) June 23, 2026
అర్ధరాత్రి కురిసిన ధారాపాత వానకు ముంబైలోని కీలక రహదారులు చెరువులను తలపించాయి. ములుండ్‌లోని ఎల్‌బీఎస్ రోడ్ లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ముంబైలో క్రానిక్ ఫ్లడ్డింగ్ స్పాట్ అయిన అంధేరి సబ్‌వే లోకి భారీగా నీరు చేరడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కింగ్స్ సర్కిల్, మాతుంగా పరిసరాల్లోనూ స్వల్పంగా నీరు చేరింది.
భారత వాతావరణ శాఖ ఆదివారం రాత్రి నుంచే నగరానికి థండర్‌స్టార్మ్, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని నౌకాస్ట్ హెచ్చరికలను జారీ చేసింది. సోమవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఐఎండీ శాంతాక్రజ్ అబ్జర్వేటరీలో 103 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబైతో పాటు పొరుగున ఉన్న ఠాణే, నవీ ముంబై జిల్లాల్లోనూ 100 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిసింది.
ప్రస్తుతం ముంబై నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు కొంకణ్ తీరం సహా ముంబై పరిసర ప్రాంతాలలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, జూలై మొదటి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : ‘వివాహం రద్దు చేసుకోవడం కంటే చంపడమే సులభం అనుకున్నా’.. సియా షాకింగ్ నిజాలు!








