Karnataka :  మండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. ఈ నెల 12వ తేదీన భీమన అమవాస్య సందర్భంగా ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ సవితపై తుమకూరు రూరల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. లైనులో వేచి ఉండాలని కోరినందుకు ఐశ్వర్య తనను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టి, విధుల నుంచి తీసివేయిస్తానని బెదిరించినట్లు ఎస్‌ఐ సవిత మీడియాకు వివరించారు.

Also Read : యువతకు మోదీ గుడ్ న్యూస్.. AI ఉచిత కోచింగ్,  ఎగ్జామ్స్‌కు ఫ్రీ కోచింగ్! 

ఘటన వివరాల్లోకి వెళితే, భీమన అమవాస్య పూజల సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గర్భగుడి వెలుపల ఎస్‌ఐ సవిత భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మద్దూరు ఎస్‌ఐ శేఖర్ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని దర్శనం కోసం తీసుకువచ్చారు. వారిలో ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. దర్శనం పూర్తయిన తర్వాత ఐశ్వర్య నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, లైనులో సామాన్య భక్తులు చాలాసేపటి నుంచి వేచి ఉన్నారని, రెండు నిమిషాలు ఆగాలని ఎస్‌ఐ సవిత విజ్ఞప్తి చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఐశ్వర్య.. తాను ఒక ఎమ్మెల్యే కుమార్తనని, తానెవరో తెలియదా అంటూ అధికారాన్ని ప్రశ్నించారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మి గర్భగుడిలోకి వెళ్లడంతో ఆమెను లోపలికి పంపి నన్ను ఎందుకు ఆపుతావు? అంటూ ఎస్‌ఐ సవితపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సవితను చెంపదెబ్బ కొట్టి, ఉద్యోగం లేకుండా చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించారు. అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుమణిగించారు.

ఈ ఘటనపై ఎస్‌ఐ సవిత శ్రీరంగపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దానికి పోటీగా ఐశ్వర్య కూడా కౌంటర్ ఫిర్యాదు నమోదు చేశారు. ఎస్‌ఐ సవితనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని మండ్య ఎస్పీ వి.జె. శోభారాణి వెల్లడించారు.

Also Read : ఎన్‌హెచ్‌ఏఐ కొత్త గైడ్‌లైన్స్‌… 10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేలు కట్టాల్సిందే..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.