old phones

Old Phones :  మనలో చాలా మంది ఇళ్లల్లో పాత ఫోన్లు వాడకుండా ఎక్కడో ఒకచోట పడేసి ఉంచుతాం. వాటిని అమ్మేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా అనుకుంటాం కానీ, ఇండియాలో చాలా మంది తమ పాత ఫోన్లను అమ్మడానికి అస్సలు ఇష్టపడట్లేదు. దీనికి కారణం తక్కువ ధర వస్తుందని కాదు, ఫోన్ అమ్మిన తర్వాత అందులో ఉండే మన పర్సనల్ విషయాలు ఎవరి చేతికి చిక్కుతాయో అనే భయమే. ఒక కొత్త సర్వే ప్రకారం, 70 శాతం మంది భారతీయులు ఈ ప్రైవసీ భయం వల్లే పాత ఫోన్లను ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు.. ఫోన్ అమ్మిన తర్వాత తమ ఫోటోలు, మెసేజ్‌లు వేరే వాళ్లు చూసి తప్పుగా వాడుకుంటారేమోనని కంగారు పడుతున్నారు. మన ఫోన్లలో బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, పర్సనల్ ఫోటోలు, చాటింగ్‌లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ భయం రావడం చాలా సహజమే.

అయితే, ఇండియాలో పాత ఫోన్లు కొనే, అమ్మే మార్కెట్ రోజురోజుకూ పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న సగం కంటే ఎక్కువ మంది తాము ఎప్పుడో ఒకప్పుడు పాత ఫోన్ అమ్మేసామని లేదా కొత్త ఫోన్ కోసం ఎక్స్ఛేంజ్ చేశామని చెప్పారు. అంటే పాత ఫోన్లు అమ్మే వాళ్ల సంఖ్య పెరుగుతోంది, కానీ దాంతో పాటే మనసులో భయం కూడా పెరుగుతోంది. ఫోన్ ఎక్కడ అమ్మాలో ఎంచుకునేటప్పుడు కూడా ప్రజల ఆలోచన మారింది. దాదాపు 45 శాతం మంది.. ఫోన్ కొనే కంపెనీ లేదా యాప్ మన డేటాను ఎంత జాగ్రత్తగా దాస్తుందనేది చూస్తున్నారు. కేవలం 30 శాతం మంది మాత్రమే ఎక్కువ ధర కోసం చూస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువ డబ్బులు వస్తే చాలనుకునే వాళ్లు, ఇప్పుడు డబ్బుల కంటే మన సమాచారం సేఫ్‌గా ఉండడమే ముఖ్యమని అనుకుంటున్నారు.

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసి

ఫోన్ అమ్మేముందు చాలా మంది ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. అంటే ఫోన్‌ను కొత్తదానిలా మార్చేస్తారన్నమాట. కానీ, అలా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా డేటా పూర్తిగా పోదని అందులో 41 శాతం మందికి తెలుసు. అంతేకాదు, ప్రతి ముగ్గురిలో ఒకరు.. తాము గతంలో డిలీట్ చేసిన ఫైళ్లను మళ్లీ ఫోన్ లోకి తెప్పించామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే, డేటా పోవడానికి మనం చేసే పద్ధతి మీదే ఎవరికీ నమ్మకం లేదని అర్థమవుతోంది. అందుకే ఫోన్ క్లీన్ చేసినా కూడా ప్రజలకు మనశ్శాంతి ఉండట్లేదు.

పాత ఫోన్లు అమ్మేముందు డేటాను ఎలా డిలీట్ చేయాలనే దానిపై మన దేశంలో గట్టి చట్టాలు రావాలని 87.2 శాతం మంది గట్టిగా చెప్తున్నారు. ఈ బాధ్యతను ఒంటరిగా జనం మీదే వదిలేయకుండా, ప్రభుత్వమే కఠినమైన రూల్స్ పెట్టాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.