
రాజకీయ నాయకుల చుట్టూ ఎప్పుడూ ఏదొక పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. అదేంటంటే… వారి ఆస్తులు ఎంత? వారికి ఎన్ని భూములు, ఇళ్లు ఉన్నాయి..? బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కలు ఏంటి? వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి..? ఇలా పొలిటీషియన్స్ ఫైనాన్షియల్ అండ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఇదే అంశంపై తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్-ADR విడుదల చేసిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆస్తుల్లోనైనా, కేసుల్లోనైనా దక్షిణాది ముఖ్యమంత్రులే టాప్ ప్లేస్‌లో ఉన్నారట. మరి ఇండియాలో అత్యంత ధనిక సీఎం ఎవరు..? ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయి..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ స్థానంలో ఉన్నారు..? ఈ విషయాలన్నీ ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.
దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను లోతుగా విశ్లేషించి ADR నివేదికను విడుదల చేసింది. 31 మంది ముఖ్యమంత్రుల ప్రకటించిన ఆస్తులు మొత్తం విలువ ఏకంగా 8 వేల కోట్ల రూపాయలకుపైగా ఉన్నట్లు తేలింది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. దేశంలోనే రిచెస్ట్ టాప్-3 సీఎంలు సౌతిండియన్సే.
ADR నివేదిక ప్రకారం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 1,413 కోట్ల ఆస్తులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 931 కోట్లకుపైగా ఉంది.
ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు 648 కోట్లు. నాలుగో స్థానంలో 332 కోట్ల రూపాయల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమా ఖందు నిలిచారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..30 కోట్లకుపైగా ఆస్తులతో ధనిక సీఎంల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. సీఎంల ఫైనాన్షియల్, క్రిమినల్ అండ్ ఎడ్యూకేషనల్ క్వాలిఫికేషన్స్‌ను అనాలసిస్ చేసి ఈ లెక్కలను ఖరారు చేసినట్లు ADR స్పష్టం చేసింది.
ఈ రిపోర్ట్ కేవలం సీఎంల ఆస్తులు, కేసుల లెక్కల వరకే పరిమితం కాలేదు. దేశంలోని ముఖ్యమంత్రుల విద్యార్హతలు, వాళ్ల వృత్తిపరమైన వివరాలను కూడా బయటపెట్టింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ ఆస్తుల విలువ రూ.7.81 కోట్లు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన వృత్తిగా పెన్షనర్, ప్రైవేట్ కాంట్రాక్టర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రావెల్ గైడ్‌గా పేర్కొన్నారు. ఇక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్తులు రూ.1.97 కోట్లు కాగా.. ఆయన విద్యార్హత ఇంటర్మీడియట్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తుల విలువ రూ.5.31 కోట్లు. ఆమె డిగ్రీ పూర్తి చేయడంతో పాటు ప్రొఫెషనల్ అడ్వకేట్‌గా ఉన్నారు. ఇక హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఆస్తులు రూ.5.80 కోట్లు. ఆయన డిగ్రీ పూర్తి చేయడంతో పాటు.. తన వృత్తిగా స్టోన్ క్రషర్ ఓనర్‌గా పేర్కొన్నారు.
Also Read : చనిపోయిన రెండేళ్లకు… మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
ఇక ముఖ్యమంత్రులపై ఉన్న కేసుల లెక్కలు చూస్తే అసలు కథ మరోలా ఉంది. రాజకీయాల్లో కేసులు ఉండటం కొత్తేమీ కాదు. కానీ.. దేశంలోని సీఎంలపై ఉన్న కేసుల సంఖ్య చూస్తే మాత్రం ఓ ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ లెక్కల్లోనూ సౌత్ సీఎంల పేర్లు టాప్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. అంటే.. దాదాపు 45 శాతం మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నమాట. ఇక ఈ జాబితాలో దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నది ఎవరో తెలుసా..? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవును.. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక కేసులు ఉన్న సీఎంగా రేవంత్ రెడ్డి టాప్‌లో నిలిచారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఏకంగా 89 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.
Also Read : 7 వేల మంది కాలేజీ స్టూడెంట్లకు హెచ్ఐవీ.. కర్ణాటక ప్రభుత్వ సంచలన నిర్ణయం!
రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఉన్నారు. ఆయనపై 29 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 19 కేసులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 19 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరితో పాటు కేరళ సీఎం సతీశన్‌పై 18 కేసులు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై 5 కేసులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై 4 కేసులు, సుఖ్విందర్ సింగ్ సుఖూపై 4 కేసులు, విజయ్‌పై 2 కేసులు, సమ్రాట్ చౌదరీపై 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సిక్కిం సీఎం పీఎస్ తమాంగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మోహన్ చరణ్, భజన్ లాల్ శర్మలపై ఒక్కో కేసు చొప్పున నమోదై ఉన్నాయి. మొత్తంగా చూస్తే, కేసుల సంఖ్య పరంగా జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌లో దక్షిణాది నేతలే ఉన్నారు.
వందల కోట్ల సంపద, డజన్ల కొద్దీ కేసులు ఉన్న సీఎంలు ఒకవైపు ఉంటే… అత్యంత స్వల్ప ఆస్తులు ఉన్న నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దేశంలోనే అత్యంత తక్కువ ఆస్తి ఉన్న ముఖ్యమంత్రిగా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన చూపించిన మొత్తం ఆస్తుల విలువ కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే, పైగా తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. తర్వాత స్థానాల్లో 85 లక్షల ఆస్తులతో బెంగాల్ సీఎం సువేందు అధికారి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ నిలిచారు.
ఈ ADR నివేదికను పరిశీలిస్తే… ఆర్థికంగా 31 మంది సీఎంలలో 15 మంది ఆస్తుల విలువ 11 కోట్ల నుంచి 49 కోట్ల మధ్యలో ఉంది. కేవలం ఇద్దరు సీఎంల ఆస్తులు మాత్రమే కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, భారత రాజకీయాల్లో ధనబలం, కేసుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రుల ఆస్తులు, వారిపై ఉన్న కేసులకు సంబంధించిన ఈ ADR రిపోర్ట్‌పై మీ అభిప్రాయం ఏంటి..? కామెంట్ చేయండి.









