
CM Vijay : తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) లో గత కొంతకాలంగా సాగుతున్న భారీ అవినీతి, నిధుల లీకేజీలపై తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే టాస్మాక్ వ్యవహారాలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎటు వంటి దారిమళ్లే అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులను సీఎం విజయ్ ఖరాఖండిగా ఆదేశించారు.
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రాజకీయ లబ్ధి కోసం, అనధికారికంగా ‘పార్టీ ఫండ్’ వసూళ్ల రూపంలో ప్రతి నెలా దాదాపు 102 కోట్ల రూపాయలు టాస్మాక్ నుండి పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ లెక్కన గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దాదాపు రూ. 1,600 కోట్లు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లాయని అధికారులు అంచనా వేశారు. టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌లో చాలారోజుల నుండి వ్యవస్థీకృతంగా నడుస్తున్న ఈ అనధికారిక వసూళ్ల దందాను తక్షణమే రద్దు చేయాలని సీఎం ఆదేశించారు.
కేస్ వారీగా వసూళ్ల లెక్కలివే..
అధికారుల అంతర్గత నివేదికల ప్రకారం.. గతంలో ప్రతి సాధారణ మద్యం కేస్‌పై దాదాపు రూ. 90, బీర్ కేస్‌పై రూ. 40, మరియు వైన్ కేస్‌పై రూ. 20 చొప్పున రాజకీయ లేదా మంత్రిత్వ నిధుల కోసం వేర్‌హౌస్‌లు, రవాణా, రిటైల్ దుకాణాల వ్యాప్తంగా బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 88 లక్షల మంది వినియోగదారులు టాస్మాక్ ద్వారా మద్యం కొనుగోలు చేస్తుండగా, ఈ దందా ద్వారా వందల కోట్లు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లినట్లు తేలింది. ఈ విషయమై స్పందించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, “అవినీతి ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదు.. లీకేజీలను వెంటనే అరికట్టి, ప్రజల సొమ్మును ఖజానాకు చేర్చండి అని సీఎం మాకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు” అని మీడియాకు వెల్లడించారు.
మరోవైపు, మద్యం విక్రయాల అనంతరం ఖాళీ బాటిళ్ల రిటర్న్ (సేకరణ) వసూళ్లలో జరుగుతున్న అక్రమాల వల్ల కూడా ప్రతి నెలా దాదాపు రూ. 300 కోట్ల అవినీతి జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భారీ లీకేజీని అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చి, ఆ రూ. 10 డిపాజిట్‌ను నేరుగా ఎమ్‌ఆర్‌పీ (MRP) ధరలోనే కలపడం లేదా పూర్తిగా డిజిటల్ రీఫండ్ విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే, ఈ జూన్ చివరి నాటికి ఖాళీ బాటిళ్ల సేకరణ బాధ్యతలను థర్డ్ పార్టీ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టాస్మాక్‌లో దాదాపు వెయ్యి కోట్ల మేర కుంభకోణం జరిగిందన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది (2025) మార్చి 6, 8 తేదీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడులను సవాల్ చేస్తూ అప్పటి తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని కొట్టివేసింది. మనీలాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే తీవ్రమైన నేరంగా పేర్కొంటూ 2025 ఏప్రిల్ 23న హైకోర్టు స్పష్టం చేయడంతో, అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
717 మద్యం దుకాణాల మూసివేత: తగ్గిన ఆదాయం..
ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన నిర్ణయాలలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 717 టాస్మాక్ రిటైల్ దుకాణాలను మూసివేయడం ప్రధానమైనది. ఈ దుకాణాల మూసివేత వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ లెక్కగట్టింది. అయినప్పటికీ, ఆ ఆదాయ నష్టాన్ని పూడ్చడానికి ప్రజలపై భారం వేస్తూ మద్యం ధరలను పెంచే ప్రసక్తే లేదని సీఎం విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్పష్టం చేసింది.









