neet exam

NEET : కర్ణాటకలో ఆదివారం జరిగిన నీట్-యూజీ 2026 రీ-టెస్ట్ సందర్భంగా నలుగురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. మే 3న జరిగిన మొదటి పరీక్ష పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ఈ రీ-టెస్ట్ నిర్వహించింది. అయితే కఠిన నిబంధనల కారణంగా ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడం వల్ల, మరొకరు పాత హాల్ టికెట్ తీసుకురావడం వల్ల పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు వారిని అనుమతించలేదు.

బెంగళూరులోని ఆర్‌.సి. కాలేజీ కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు రాగా, గేట్లు మూసివేయడంతో ఇద్దరు లోపలికి వెళ్లలేకపోయారు. పరీక్ష రాయనివ్వాలని ఒక విద్యార్థిని ఏడుస్తూ కాంపౌండ్ గ్రిల్ ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను కిందకు దించారు. మరో విద్యార్థిని పాత హాల్ టికెట్ తెచ్చుకోవడంతో తిరస్కరించారు. అలాగే కొప్పల్ జిల్లా గంగావతిలో ఒక విద్యార్థి 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో లోపలికి రానివ్వలేదు. ఈ సంఘటనల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు 

ఈ ఉదంతంపై బీజేపీ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించడం వల్లే నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని, దీనివల్ల విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోలేకపోయారని ఆరోపించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష రోజే కాంగ్రెస్ ఈ ర్యాలీని ఎందుకు ఎంచుకుందని ఆయన ప్రశ్నించారు.

ఈ విమర్శలపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే అంతే ఘాటుగా స్పందిస్తూ, బీజేపీ ఎంపీది తప్పుడు సమాచారమని కొట్టిపారేశారు. ఒక విద్యార్థిని బస్సు దొరక్క ఆలస్యమైందని, ట్రాఫిక్ పోలీసులందరూ ముందే అప్రమత్తంగా ఉండి సూచనలు జారీ చేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీల వల్ల 22 లక్షల మంది విద్యార్థులు నష్టపోయినప్పుడు, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నోరు మెదపని బీజేపీ నేతలు.. ఇప్పుడు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని ఆయన ఎదురుదాడి చేశారు.

హరిప్రసాద్ KPCC చీఫ్ గా 

కాగా బి.కె. హరిప్రసాద్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, దాదాపు లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఈ పదవిలో సీఎం డీకేశివకుమార్ ఉండేవారు. ఇటీవల ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో కేపీసీసీ చీఫ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం ఉంది.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.