dmk mla

తమిళనాడులో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత, సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి, ప్రస్తుత డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత జూన్ 20న మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూరులో జరిగిన బహిరంగ సభలో రాధాకృష్ణన్ మాట్లాడారు. ఆ ప్రసంగంలో సీఎం విజయ్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనే భయంతో రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

తీసుకువెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం

కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత, రాధాకృష్ణన్ ఓ ప్రభుత్వ కార్యాలయంలో అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆత్తూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం ఈ అరెస్ట్ ప్రక్రియను చేపట్టింది. అయితే, ఈ సమాచారం అందుకున్న డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీసు వాహనాన్ని ముట్టడించారు. రాధాకృష్ణన్‌ను తీసుకువెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు ఆయనను తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి డిటైన్ చేశారు.

ఇదిలా ఉండగా, అనితా రాధాకృష్ణన్‌తో పాటు మరో మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని టీవీకే ప్రభుత్వం ఇటీవల గవర్నర్ ఆర్. వి. అర్లేకర్‌ను కోరింది. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సి. టి. ఆర్. నిర్మల్ కుమార్ సోమవారం గిండీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ విజ్ఞప్తిని అధికారికంగా అందజేశారు. ఈ పరిణామాల మధ్యే తాజాగా ఎమ్మెల్యే అరెస్ట్ కావడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.