Metro : ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం వేళ లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర గ్రీన్ పార్క్ వైపు వెళ్తున్న ఇద్దరు మహిళలను, ఓ వ్యక్తి వారికి తెలియకుండా రహస్యంగా వీడియో తీస్తూ దొరికిపోయాడు. తమ పక్కనే కూర్చున్న ఆ వ్యక్తి తమ అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడని అనుమానం రావడంతో ఆ మహిళలు అతడిని గమనించడం మొదలుపెట్టారు.

తాను దొరికిపోయానని తెలిసినా కూడా ఆ వ్యక్తి భయం లేకుండా వారి వైపే చూడటంతో ఆ మహిళలకు చాలా కోపం వచ్చింది. దాంతో ధైర్యంగా ముందుకు వచ్చి అతడిని నిలదీసి ఫోన్ చూపించమని అడిగారు. తాను ఎలాంటి ఫొటోలు తీయలేదని ఆ వ్యక్తి అబద్ధం చెబుతూనే, వారు చూస్తుండగానే ఫోన్ లోని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ప్రారంభించాడు.

ఫొటోలన్నీ డిలీట్ చేశానని అనుకుని అతడు ఫోన్‌ను వారికి చూపించాడు. కానీ ఆ మహిళలు తెలివిగా ఫోన్ లోని రిసైకిల్ బిన్ చెక్ చేయగా, అక్కడ వీడియో స్పష్టంగా కనిపించింది. ఒకరి అనుమతి లేకుండా ఫొటోలు లేదా వీడియోలు తీయడం తప్పని వారు అతడికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మహిళల రక్షణ గురించి ఈ ఘటన మరోసారి ఆలోచించేలా చేసింది. నిత్యం ప్రయాణాలు చేసే మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంపై జనాలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు పట్టించుకోకపోవడంపై కొందరు బాధపడగా, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.