Mother : ఐఫోన్ ఈఎంఐ కట్టలేదనే గొడవతో కొండ అంచున నిలబడి ఆత్మహత్యకు యత్నించిన కునాల్ అనే 19 ఏళ్ల యువకుడిని కాపాడేందుకు తల్లిపడిన ఆవేదన విషాదాన్ని నింపింది. కొడుకును రక్షించుకోవడానికి ఆ తల్లి ఎంతో వేడుకుంది, కాళ్ళావేళ్ళా పడింది. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

కొడుకు ప్రమాదంలో పడతాడనే భయంతో ఆ తల్లి గంటల తరబడి క్షణక్షణం నరకం అనుభవించింది. చివరికి తన 19 ఏళ్ల కొడుకు, భర్త ఇద్దరూ 250 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లి చూస్తూ తట్టుకోలేకపోయింది. గుండె పగిలిన ఆ తల్లి, క్షణాల వ్యవధిలోనే వారి వెనుకే దూకి బలవన్మరణానికి పాల్పడింది.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని కొడ్యా డోంగర్ కొండపై ఈ విషాదకర ఘటన జరిగింది. కునాల్ చంద్రగూడే, అతని తల్లిదండ్రులు మురళీధర్, సంగీత ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ఐఫోన్ ఈఎంఐ కట్టలేదనే చిన్న విషయానికి కొడుకు ఆత్మహత్యకు సిద్ధపడటంతో ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం.

కొండ అంచున కునాల్ నిలబడి ఉండగా, తల్లి సంగీత కొద్ది దూరంలో నేలపై కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన దగ్గరకు రమ్మని వేడుకుంది. కొడుకు కోసం ఆమె కాళ్ల మీద పడి బ్రతిమలాడింది. అది పనిచేయకపోవడంతో లేచి అతని వైపు వెళ్తూ తన చేయి చాచింది. కునాల్ అడుగు ముందుకు వేయగానే ఆమె భయంతో వెనక్కివెళ్లింది. ఆమె గొంతు పూడిపోయి అయ్, కునాల్ అని పిలిచిన ఆర్తనాధాలు అందరినీ కంటతడి పెట్టించాయి. కానీ ఆ యువకుడి మనసు మాత్రం కరగలేదు.

కొడుకు ఎవరి మాట వినకపోవడంతో, తండ్రి మురళీధర్ అతన్ని రక్షించడానికి ముందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ కాలుజారి లోయలో పడిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి సంగీత కేవలం నాలుగు సెకన్ల వ్యవధిలోనే కిందకు దూకి ప్రాణాలు విడిచింది.

కొన్ని నెలల కిందట ఆ కుటుంబం ఆ ప్రాంతానికి వచ్చి నివాసముంటోంది. వారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ వారు పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై ఎంతో ప్రేమ చూపించేవారు. తన యజమానులు ఎప్పుడొస్తారా అని ఆ కుక్క ఇంకా కిటికీలో నుంచి రోడ్డు వైపు ఎదురుచూస్తూనే ఉందని స్థానికులు కన్నీటిపర్యూరమయ్యారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.