Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక్క సిక్సర్ దూరంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఎ A) సెంచరీ రికార్డును మిస్ చేసుకున్నాడు. కానీ, అంతకంటే ముందే ఇండియా-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌తో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆదివారం రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక-ఎ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ, వారి నిర్ణయం ఎంత తప్పో నిరూపించడానికి వైభవ్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. మొదటి 9 ఓవర్లలోనే శ్రీలంక బౌలింగ్‌ను అతడు ముక్కలు ముక్కలు చేసేశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా అతనికి సాధ్యమయ్యేలా కనిపించింది.

సెంచరీ రికార్డు మిస్

ప్రస్తుతం లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ పేరిట ఉంది. అతను 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ టాస్మానియాపై 29 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మన వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 94 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంటే అతను ఎదుర్కొన్న 29వ బంతికి సిక్స్ కొట్టి ఉంటే, సరిగ్గా 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డును సమం చేసేవాడు. టీ20 క్రికెట్ మొత్తంలో చూసుకుంటే సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే చేసిన సెంచరీ అత్యంత వేగవంతమైనది కాగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం వైభవ్ ఆ రికార్డుకు కేవలం ఒక్క షాట్ దూరంలో నిలిచిపోయాడు.

కానీ, దురదృష్టవశాత్తూ 29వ బంతికి ఆ ప్రయత్నం విఫలమైంది. కవర్స్ మీదుగా మరో భారీ షాట్ కొట్టే క్రమంలో వైభవ్ బంతిని గాల్లోకి లేపాడు, అది కాస్తా మిడ్-ఆఫ్‌లో ఉన్న విజయకాంత్ వియాస్కాంత్ చేతుల్లోకి వెళ్ళింది. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో వైభవ్ అవుట్ అవ్వడంతో ఇండియా-ఎ జట్టు 8.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. సెంచరీ మిస్సయినప్పటికీ అతను చేసిన విధ్వంసానికి స్టేడియం దద్దరిల్లిపోయింది. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అంటే అతను చేసిన 94 పరుగులలో 88 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం విశేషం.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.