sreeleela

Sreeleela :  ముంబైలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్ మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో అమృతా ఫడణవీస్ తన కుమార్తె దివిజతో కలిసి పాల్గొన్నారు. అదే వేదికపై నటి శ్రీలీల కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వీరంతా కలిసి ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.

అయితే ఆ సమయంలో అక్కడున్న ఫొటోగ్రాఫర్లు అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె దివిజలను మాత్రమే విడిగా ఒక ఫొటో ఇవ్వాలని కోరారు. దాంతో అమృతా ఫడణవీస్ పక్కనే నిలబడిన శ్రీలీల వైపు చేతి వేలితో సైగ చేస్తూ, కొద్దిసేపు పక్కకు తప్పుకోవాలని అడిగారు. ఆ సైగ చూసి శ్రీలీల ఒక్కసారిగా కొద్దిగా అసౌకర్యంగా ఫీలైనప్పటికీ, ఏమాత్రం మొహమాటపడకుండా వెంటనే ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో పక్కకు జరిగి నిలబడ్డారు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లు అమృత, ఆమె కుమార్తె ఫొటోలను తీసుకున్నారు.

వీడియో నెట్టింట వైరల్

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది అమృతా ఫడణవీస్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అంత పెద్ద హీరోయిన్ అని కూడా చూడకుండా, అంతమంది ముందు అలా వేలితో సైగ చేసి పక్కకు వెళ్లమనడం సరికాదని విమర్శిస్తున్నారు. అదే సమయంలో, అంతటి అవమానం జరిగినట్లు అనిపించినా శ్రీలీల ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, చాలా హుందాగా, ఓపికతో నవ్వుతూ పక్కకు తప్పుకోవడాన్ని నెటిజన్లు, ఆమె అభిమానులు ఎంతో మెచ్చుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై అటు అమృతా ఫడణవీస్ కానీ, ఇటు శ్రీలీల కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.